ఓ అద్భుతమైన శుభవార్త వెలువడింది..ఇన్నాళ్లు..తమ పక్క గ్రామల భూములో, తమ పక్క భూములో రాజధానికి పోయాయని, తమవి మిగిలిపోయాయని సంబరపడే జనాలకు ఇది దుర్వార్త. రాజధాని వచ్చాక తమ భూములు బంగారం, ప్లాటినం అయిపోతాయని అనుకుంటుంటే, మొదటికే మోసం వస్తుందనుకునే వార్త.
ఇప్పుడు తీసుకుంటున్న నలభై,యాభై వేల ఎకరాల భూమి రాజధానికి చాలదంట.. రాజధాని మాత్రం కాదు, దానికి అన్ని హంగులు కావాలంటే, ఇంకా చాలా..చాలా..భూములు కావాలంట. ఆకలి అనేది ఒక్క తిండికి సంబంధించినదే కాదు. భూములకు సంబంధించినది కూడా అని ఇప్పుడు అర్థమవుతోంది.
ఈ ఆకలి నలభై యాభై వేల ఎకరాలతో తీరదు..అది లక్ష ఎకరాలకు పాకేలాగే వుంది. అలా అలా ఇప్పుడు సిఆర్డీఏ జోన్ అంటూ ఏదైతో మార్కింగ్ చేస్తున్నారో, అదంతా తిన్నా సరిపోదేమో? వాళ్ల గ్రామాలు, వాళ్లు పోరాడతారు. మనం పక్కన వున్నాం..మన భూముల రేట్లు అమాంతం పెరిగిపోతాయి అనుకున్నవాళ్లు కూడా పోరాటంలోకి దిగాల్సి వచ్చేలాగే వుంది. అప్పటికి వాళ్ల పోరాటం ఆగిపోతుంది. వీళ్ల ఆరాటం మొదలవుతుంది. ఇలా పీస్ మీల్ పోరాటాలు ఫలితాలివ్వవు..కానీ పీస్ మీల్ గా తిన్నా భూ ఆకలి మాత్రం తీరిపోతుంది.
ఎవరో చెప్పిన గాలి వార్త కాదు..ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నమాట..రాజధానికి ఇప్పడు తీసుకున్న భూములు చాలవని కుండ బద్దులుకొట్టిన వైనం. అందుకే..రాజధాని పక్క గ్రామల రైతులూ బహుపరాక్.