టాలీవుడ్ లో టాప్హీరోగా కొంతకాలం ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పిస్తున్న సుమన్… రాజకీయాల పట్ల తన వైఖరిని వెల్లడించాడు. తన 58వ బర్త్‌డే (శుక్రవారం) సందర్భంగా మాట్లాడుతూ… రాజకీయాలంటే పార్ట్‌టైమ్ జాబ్ కాదని అభిప్రాయపడ్డాడు. రాజకీయాల్లోకి రావాలని తను అనుకోకూడదని, ప్రజలు కోరుకోవాలని అన్నాడు.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగా పనిచేయడం తన వల్ల కాదన్నాడు. ప్రజలు పాల్గొనే మీటింగ్‌కి రమ్మంటే షూటింగ్ గ్యాప్‌లో వెళ్లొచ్చేయడం లాంటివి చేయడం సరైంది కాదన్నాడు. రాజకీయాలంటే చాలా పెద్ద బాధ్యతని దాన్ని ఒకసారి స్వీకరిస్తే ప్రజలు మర్చిపోలేని విధంగా వారికి సేవ చేయాలని అంటున్న సుమన్.. తాను ముందు సామాజిక సేవలోకి వస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆ తర్వాత ప్రజలు తన పనితీరు మెచ్చి పూర్తిగా ప్రజాజీవితంలోకి రమ్మంటే అప్పుడు ఆలోచిస్తానన్నాడు.
తన జీవితంలో మరచిపోలేని పాత్ర అన్నమయ్య సినిమాలోని వెంకటేశ్వరస్వామి పాత్ర అన్న సుమన్… ఆ సినిమాను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మతో కలిసి చూడడం, ఆయన తనను ఎంతో అభినందించడం మరచిపోలేనన్నాడు. తాను నటించిన రుద్రమదేవి త్వరలో విడుదల కానున్న విషయంపై మాట్లాడుతూ… తెలుగులో పూర్తిస్థాయి విలన్‌గా చేస్తున్న తొలి పాత్ర ఇదేనన్నాడు.