సినిమా వాళ్ల పెళ్లిళ్లకు రాజకీయ నాయకులు క్యూ కట్టడం సహజం. డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా సరే వెళ్లి మరీ అక్షింతలు వేసి వస్తుంటారు. అలాంటిది రాజమౌళి కొడుకు పెళ్లికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క పొలిటీషియన్ వెళ్లలేదు. కేవలం సినిమావాళ్లు, అది కూడా కొంతమంది మాత్రమే జైపూర్ వెళ్లారు. ఈ పిలుపుల వెనక రాజమౌళి ఆలోచన విధానం స్పష్టంగా కనిపిస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో మొహమాటాలు లేని వ్యక్తి అంటే ముందు గుర్తుకొచ్చేది రాజమౌళి. సినిమా తీస్తే కోట్లు కుమ్మరిస్తానంటున్నా మంచు ఫ్యామిలీ హీరోలకు నో చెప్పిన వ్యక్తి రాజమౌళి. అదే రాజమౌళి తాను ఏ ఒక్కరికీ దగ్గర వ్యక్తిని కాదనీ, ఎవరికీ దూరంకాననీ చెప్పుకుంటూ ఉంటాడు. నీ ఫేవరెట్ హీరో ఎవరంటేనే చెప్పడానికి ఇష్టపడని రాజమౌళి, ఇప్పుడు పొలిటికల్ పిలుపులతో తలనొప్పి తెచ్చుకోదలుచుకోలేదు. అందుకే అందరికీ సమాన దూరం పాటించాడు.
ఏపీ రాజధాని అమరావతి డిజైన్ల వ్యవహారంతో చంద్రబాబుకి కాస్త దగ్గర వ్యక్తిగా రాజమౌళికి పేరుపడింది. అందులోనూ ఆయన గురువు రాఘవేంద్రరావు స్వయానా ఆ పార్టీ మనిషి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అధికార పార్టీనేతలు పెళ్లిలో సందడి చేస్తే ఎలాంటి సంకేతాలు వెలువడతాయో రాజమౌళి అంచనా వేశాడు. అందుకే పొలిటీషియన్లను టచ్ చేయలేదు.
కేవలం తన బంధువులు, సినిమా ఇండస్ట్రీలో తనకు ఆత్మ బంధువులు అనుకున్న వారికి మాత్రమే పిలుపులు వెళ్లాయి. ఎలాంటి భేషజాలు లేకుండా వీరంతా ఒకేచోట చేరి సందడి చేశారు. తమ ఇంటిపెళ్లి అన్నంత ఇదిగా రాజమౌళి కొడుకు పెళ్లి వేడుకలో కనిపించారు.
పెళ్లి వేడుకకు పరిమితులు పెట్టుకున్నప్పటికీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసే రిసెప్షన్ కి మాత్రం అన్నిపార్టీల నేతలు, సినిమా వాళ్లను ఆహ్వానించాడు రాజమౌళి.