దర్శకుడు రాజమౌళి చాలా సింపుల్ పర్సన్…ఆయనది సింపుల్ లివింగ్ కూడా. వందల కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాలు చేసే ఆయనకు ఓ ఖరీదైన కారు కూడా లేదు. ఒక్కోసారి క్యాబ్ లోనే వెళ్లిపోతుంటారు. ఇప్పటికీ అపార్ట్ మెంట్ లోనే లివింగ్. అలాంటిది తొలిసారి ఓ మాంచి ఫార్మ్ హవుస్ కు శ్రీకారం చుడుతున్నారు. నగర శివార్లలో ఆయనకు ఓ ఇరవై ఎకరాల భూమి వుంది. అందులో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఫార్మ్ హవుస్ కట్టుకోవాలని అనుకుంటున్నారు. అందుకు ప్లానింగ్ పూర్తి చేసారు. ఇరవై ఎకరాల్లో తోటలు, పంటల చేలు, అందులోనే ఓ చిన్న విలేజ్ మాదిరిగా ఒకటి రెండు చిన్న ఇళ్లు..ఓ పెద్ద ఇల్లు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణం మొదలు పెట్టడమే తరువాయి.
రాజమౌళికి అత్యంత ఆప్తుడు, ఇష్టుడు అయిన ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ మొత్తం ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా, దారులు, ఇలాంటివి కూడా ఈ డిజైన్ లో వుంటాయని తెలుస్తోంది. మర్యాద రామన్న సినిమా కోసం రవీందర్ తో వేయించిన ఇంటి సెట్ రాజమౌళి మైండ్ సెట్ లోంచి వచ్చింది. ఇప్పటికి ఆ ఇంట్లో కొన్ని వందల సినిమాల షూటింగ్ లు జరిగాయి. ఆ ఇల్లు కూడా పల్లె అందాలను పుణికి పుచ్చుకున్నట్లు వుంటుంది. రాజమౌళి అంటేనే వైవిధ్యమైన సెట్ లకు , విజువల్స్ కు పెట్టింది పేరు. మరి ఆయన ఫామ్ హవుస్ అంటే మరి ఎలా వుంటుందో?
రాజమౌళి ఫార్మ్ కు పక్కనే ఆయన కుడి ఎడమల్లాంటి కీరవాణి, సాయి కొర్రపాటి లకు కూడా ఇరవై, డెభై ఎకరాల తోటలు వున్నాయి. మరి రాజమౌళి ఫామ్ హువుస్ చూసి వాళ్లూ కడతారేమో?