జవాబులు – జెపి ఉద్యమం గురించి నేను రాసినది చూసి ఒక పాఠకుడు ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించడానికి సరైన కారణం వుందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నానని అపోహ పడ్డారు. అలా అయితే జెపి ఉద్యమప్రభావం పెద్దగా లేదని ఎందుకు రాస్తాను? నిదానంగా ఆలోచిస్తే ఎమర్జన్సీ విధించేటంత తీవ్రమైన పరిస్థితి లేదని నేను విశదీకరిస్తున్నానని బోధపడుతుంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాల గురించి తొలి భాగాల్లోనే రాశాను. అలహాబాద్ జడ్జిమెంట్ వచ్చీ రాగానే ఆ ఫలితాలు కూడా రావడంతో ఇందిర చలించింది. కానీ ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెసు బలం మరీ క్షీణించలేదని కూడా గణాంకాలు యిచ్చాను. జెపి ఉద్యమం బలహీనపడే దశకు వచ్చాక కూడా ఇందిర ఎమర్జన్సీ ఎందుకు విధించినట్లు? అలహాబాదు కోర్టు తీర్పు వచ్చినా సుప్రీం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవచ్చు. తన బదులు మరొక డమ్మీని కూర్చోబెట్టి రాజ్యం చేయవచ్చు. తొందరపాటుతో, తెలివితక్కువగా ఎమర్జన్సీ విధించి ఆమె 1977 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. ఆమె తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ సవ్యంగా వ్యవహరించి వుంటే ఆమె మళ్లీ ప్రధాని అయి వుండేది కాదు. 1975 వరకు ఎంతో రాజనీతిజ్ఞత ప్రదర్శించి, ఎందరో హేమాహేమీలను మట్టి కరిపించిన ఇందిర ఆ క్షణంలో ఎందుకు యిలాటి అప్రజాస్వామికమైన, అవివేకమైన నిర్ణయం తీసుకుంది? దానికి సరైన సమాధానం ఆమె మాత్రమే చెప్పగలుగుతుంది. కానీ బయట కనబడుతున్న విషయాల బట్టి విశ్లేషిస్తే ఆనాటి ఆమె తొందరపాటుకు కారణం ఆమె సుపుత్రుడు సంజయ్ గాంధీ అనిపిస్తుంది. అతని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే తప్ప అతని మానసిక ధోరణి, తల్లిపై అతనికి వున్న పట్టు అర్థం కావు.
సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న ఢిల్లీలోని వెల్లింగ్డన్ ఆసుపత్రిలో పుట్టాడు. అనుకున్నదాని కంటె ముందుగానే పుట్టడంతో ప్రసవంలో తల్లి చచ్చిబతికింది. ఫిరోజ్ కూడా వూళ్లోనే వున్నాడు. బాలింతరాలిగా వుండగానే రక్తహీనత నుండి కోలుకోవడానికి ఇందిర తన యిద్దరు కొడుకులతో మసూరీ వెళ్లి వుండసాగింది. ఆమె అక్కడ వుండగానే దేశవిభజన జరగడం, శరణార్థులు ఢిల్లీ వచ్చిపడడం జరిగింది. నెహ్రూ ప్రధాని అయ్యాడు. యార్క్ రోడ్డు లోని ఆయన యిల్లు శరణార్థులతో బిలబిలలాడుతూ వుండేది. ఫిరోజ్ లఖనవ్‌లో వుండేవాడు. ఇందిర తన పిల్లల్ని వేసుకుని ఓ సారి ఢిల్లీ, మరోసారి లఖనవ్ వెళ్లి వస్తూ వుండేది. ఈ సంచార జీవనం అందరికీ యిబ్బందిగానే వుండేది. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన భారతప్రభుత్వంలో పాలకులందరూ మామూలు యిళ్లల్లో వుంటూ సాధారణ జీవనం గడపాలని గాంధీ సూచించారు. నెహ్రూ కూడా సరేనన్నారు. కానీ మౌంట్‌బాటెన్ నెహ్రూకి నచ్చచెప్పాడు – 'భారతప్రధాని అనగానే దేశవిదేశాల ప్రముఖులు మీ యింటికి వస్తూ వుంటారు. బస చేస్తూ వుంటారు. మీకోసం కాకపోయినా వారి కోసమైనా విశాలమైన, సుందరమైన యింట్లో వుండాలి.' అని. అప్పటివరకు బ్రిటిష్ కమాండర్ యిన్ చీఫ్ నివసించిన యింటికి తీన్‌మూర్తి భవన్ అని పేరు పెట్టి నెహ్రూ అక్కడ వుండసాగాడు. దానిలో పెద్దపెద్ద గార్డెన్లు, లాన్లు, ఫౌంటెన్లు, విశాలమైన హాళ్లు వున్నాయి. అనేకమంది పరిచారికులు వున్నారు. తన పిల్లలు అక్కడ పెరిగితే బాగుంటుందని ఇందిరకు తోచింది.
1949 నాటికే ఇందిరకు, భర్తకు విభేదాలు పొడసూపాయి. ఇద్దరూ కలిసి ఒక కప్పు కింద జీవించడం కష్టమనే తీర్మానానికి వచ్చేశారు. కానీ విడాకులు తీసుకునే ఉద్దేశమూ లేదు. ప్రేమించి, తండ్రిని ఎదిరించి చేసుకున్న వివాహం యిలా కావడంతో ఇందిర నిరాశపడింది. తన బాధలు మర్చిపోవడానికి వ్యాపకం కోసం వెతికింది. అప్పుడే స్వాతంత్య్రం రావడంతో, నెహ్రూకు అంతర్జాతీయంగా ఖ్యాతి రావడంతో అనేకమంది దేశవిదేశ ప్రముఖులు తీన్‌మూర్తి భవన్‌కు వచ్చేవారు. వారి ఆతిథ్యమర్యాదలు, విందు వినోదాల ఏర్పాట్లు చూడడానికి ఆడదిక్కు కావలసి వచ్చింది. నెహ్రూ భార్య కమల అప్పటికే మరణించింది కాబట్టి, యింటి వ్యవహారాలు చూడడానికి నెహ్రూ చెల్లెళ్లు – విజయలక్ష్మీ పండిత్, కృష్ణా హాథీసింగ్ వచ్చేశారు. వాళ్లు అప్పటికే మధ్యవయస్కులు కాబట్టి సంసారబాధ్యతలు పెద్దగా లేవు. పైగా యిక్కడ వుంటే గ్లామర్ వుంటుంది. వచ్చిన ప్రముఖుల సతీమణులతో మాటామంతీ, షాపింగులో సహాయం చేయడం, తమ తెలివితేటల్ని ప్రదర్శించడం… యిలాటివి మంచి కిక్ యిస్తాయి. కాపురం చెడి తను వేరే వూళ్లో ఒంటరిగా కూర్చుంటే తన మేనత్తలు యిలా వెలిగిపోవడం ఇందిరకు కష్టం తోచింది. తండ్రికి చేదోడువాదోడుగా వుంటూ పితౄణం తీర్చుకోవడమే కాక, అతనితో కలిసి విదేశీ పర్యటనలు చేయవచ్చు, విదేశీ ప్రముఖుల కళ్లల్లో పడవచ్చు. తన పిల్లల్ని చూసుకోవడానికి యింటి నిండా ఆయాలున్నారు. ఆడుకోవడానికి తోటలున్నాయి. భర్త వద్ద వుంటే మధ్యతరగతి బతుకు. పైగా అతనెప్పుడూ తన స్నేహితులతో, అనుచరులతో బిజీయే. వేళకు యింటికి వచ్చే రకం కాదు. అందువలన ఇందిర భర్త దగ్గర మధ్యతరగతి యిల్లాలుగా వుండేబదులు తండ్రికి సహాయకురాలిగా వుండడమే మెరుగనుకుంది. ఫిరోజ్ లఖనవ్ నుంచి వస్తూపోతూ వుండేవాడు.
నెహ్రూ కుటుంబంలో మొదటి నుంచీ పిల్లల్ని విదేశీ ఆయాల వద్ద పెంచే అలవాటుంది. నెహ్రూ, ఇందిర, ఫిరోజ్ ముగ్గురూ ప్రజాజీవితంలో బిజీగా వుంటారు కాబట్టి పిల్లల కోసం సమయం వెచ్చించలేరు. అందుకని ఇందిర పిల్లల్ని పెంచడానికి ఆనా అనే డానిష్ యువతిని ఆయాగా పెట్టారు. విజయలక్ష్మి పిల్లల్ని కూడా ఆమెయే పెంచింది. ఆనా పిల్లల్ని చాలా క్రమశిక్షణలో పెంచింది. సంజయ్‌కు చిన్నప్పటినుంచి జంతువులన్నా, పక్షులన్నా యిష్టం. తీన్‌మూర్తి భవన్‌లో తనకంటూ ఓ చిన్న జూ తయారుచేసుకున్నాడు. నెహ్రూకు మనుమలంటే చాలా యిష్టం. చాలా గారాబం చేసేవాడు. ఏ మాత్రం తీరికున్నా వాళ్లతో ఆడుకునేవాడు. సెలవు దొరికితే పిల్లల్ని కశ్మీర్ తీసుకెళ్లేవాడు. ఫిరోజ్ ఢిల్లీ వచ్చినప్పుడల్లా పిల్లల్ని భార్యను తీసుకుని ఓఖ్లాకు పిక్నిక్‌కు తీసుకెళ్లేవాడు. 1952లో ఫిరోజ్ రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెసు టిక్కెట్టుపై ఎంపీగా గెలిచాడు. లఖనవ్ నుంచి ఢిల్లీకి వచ్చి మావగారింట్లో వున్నాడు. కొన్నాళ్లే వుండగలిగాడు. ఎందుకంటే అక్కడి కట్టుబాట్లు అతనికి మింగుడు పడలేదు. అతనికి రోజంతా స్నేహితులు వస్తూ వుండేవారు. ఓ సారి వాళ్లకోసం మధ్యాహ్నం కాఫీ తెమ్మని అడిగితే కాఫీ వేళ అయిపోయిందని నౌకర్లు చెప్పారట. పైగా తన స్నేహితులందరూ యిల్లరికం వుంటున్నాడని ఎద్దేవా చేయడంతో అతను నొచ్చుకున్నాడు. తాము ఒకే కప్పు కింద వుంటే పోట్లాటలు ఎక్కువవుతున్నాయని, అంతకంటె వేర్వేరు చోట్ల వుంటూ అప్పుడప్పుడు కలుస్తూ వుంటే మంచిదనీ భార్యాభర్తలు యిద్దరూ అనుకున్నారు. పిల్లల ఎదురుగా పోట్లాడుకోవడం యిద్దరికీ యిష్టం లేదు. అందువలన ఫిరోజ్ ఎంపీగా తనకు ఎలాట్ చేసిన క్వార్టర్స్‌కు మారిపోయాడు. కానీ రెండు మూడు రోజులకోసారి బ్రేక్‌ఫాస్ట్ టైముకి వచ్చి భార్యాబిడ్డలతో కలిసి తింటూ వుండేవాడు.
నాలుగేళ్ల వయసులో సంజయ్‌ను ఢిల్లీలోని శివ్ నికేతన్ అనే కిండర్‌గార్టన్ స్కూల్లో వేశారు. ఏడేళ్ల వయసు వచ్చేసరికి దెహరాదూన్‌లోని 'వెల్‌హామ్'లో చేర్చారు. అది రెసిడెన్షియల్ స్కూలు. సంజయ్ తల్లితో బాగా అనుబంధం వుంది. విడిగా వుంటే బెంగ పెట్టుకుంటాడేమో తెలియదు. అందుకని అతన్ని స్కూల్లో చేర్చి ఇందిర వూళ్లో హోటల్లో వుంటూ రోజూ రెండుసార్లు చూడడానికి వచ్చేది. కానీ సంజయ్‌కు బెంగ తగ్గలేదు. ఎవరితో కలిసేవాడు కాదు, ఆడేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. తల్లి కోసం చూస్తూ కూర్చునేవాడు. హెడ్‌మిస్ట్రెస్ రోజుకి ఒకసారి వచ్చి చూడమంది. రోజు మార్చి రోజు వచ్చినా, మూడు రోజుల కోసారి వచ్చినా ఏమీ లాభం లేకపోయింది. మీరు ఢిల్లీ వెళ్లిపోతే తప్ప మీ అబ్బాయి బాగుపడడు అని హెడ్‌మిస్ట్రెస్ చెప్పి పంపించివేసింది.
ఏది ఏమైనా సంజయ్ ఒంటరితనం ఫీలయ్యాడు. అన్నగారు రాజీవ్ కూడా అదే స్కూల్లో వున్నాడు కాబట్టి అతనితో తిరిగేవాడు. వేరెవరితో స్నేహంగా వుండేవాడు కాదు. ఈత కొట్టడం తప్ప వేరే ఏ ఆటా ఆడేవాడు కాదు. చదువుపై శ్రద్ధ పెట్టేవాడు కాదు. తీన్‌మూర్తి భవన్‌లో అతను యువరాజులా బతికాడు. ఇక్కడ అతన్ని పట్టించుకునేవారు లేరు. అక్కడ వున్నవాళ్లందరూ గొప్ప కుటుంబాలనుంచి వచ్చినవారే. ఆ స్పృహ లేకుండా పెంచాలనేదే ఆ స్కూలు లక్ష్యం. కానీ ఆ విధమైన నిర్లిప్తత సంజయ్ జీర్ణించుకోలేక పోయాడు. పదేళ్ల వయసులో అతను దూన్ స్కూల్లోకి మారాడు. అక్కడా అందర్నీ సమానంగా చూసే ఫిలాసఫీయే. చేరేవాళ్లందరూ రాజామహారాజాల పిల్లలు, పారిశ్రామికవేత్తల పిల్లలు, రాజకీయనాయకుల పిల్లలు.. ఎవరికీ ప్రాధాన్యత లేదు. రాజీవ్ అలాటి వాతావరణంలో సులభంగా యిమిడిపోయాడు కానీ సంజయ్ యిబ్బందిగా ఫీలయ్యాడు. అతనికి చదువులో, ఆటల్లో దేనిలోనూ ఆసక్తి లేదు. స్కూల్లో వెనకబెంచీల్లో కూర్చునేవాడు. ఏదో సాకు చెప్పి గేమ్స్ ఎగ్గొట్టేవాడు. పెద్ద వక్త కాదు. ''అయితే ఐడియాలు మాత్రం బాగా చెప్పేవాడు. పన్నెండేళ్ల వయసులో హిమాలయాలను వింటర్ గేమ్స్‌కి ప్లేగ్రౌండ్‌గా ఎలా మార్చవచ్చో, యిన్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్‌తో ఫైవ్ స్టార్ హోటళ్లు ఎలా పెట్టవచ్చో చెప్తూండేవాడు'' అని ఒక క్లాస్‌మేట్ గుర్తు చేసుకున్నాడు. పెద్దయినా ఆ ఐడియా సంజయ్‌ను వదలలేదు. ఎమర్జన్సీ నడిచేటప్పుడు హిమాలయాల్లో ప్లేబోయ్ క్లబ్స్, కాసినోస్ పెడదామనే ఆలోచన చేశాడు. (సశేషం)
(ఫోటో – ఫిరోజ్, ఇందిర)
–ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)