ఎమ్బీయస్‌: జైట్లీకి స్థానచలనం..?

మోదీ కాబినెట్‌లో మార్పులు తప్పవని అప్పుడప్పుడు వార్తలు వస్తూంటాయి. ఈసారి కాస్త గట్టిగానే వస్తున్నాయి. మోదీ పనితీరు ప్రజలు ఆశించిన మేరకు లేదని సర్వేసర్వత్రా వినబడుతున్న విమర్శ. సర్వే ప్రకారం కూడా బిజెపికి 10%…

మోదీ కాబినెట్‌లో మార్పులు తప్పవని అప్పుడప్పుడు వార్తలు వస్తూంటాయి. ఈసారి కాస్త గట్టిగానే వస్తున్నాయి. మోదీ పనితీరు ప్రజలు ఆశించిన మేరకు లేదని సర్వేసర్వత్రా వినబడుతున్న విమర్శ. సర్వే ప్రకారం కూడా బిజెపికి 10% సీట్లు తక్కువ వస్తాయని అంచనా. ఢిల్లీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్‌, మహారాష్ట్రలలో స్థానిక ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో ఉపయెన్నికలు – యిలా చాలా చోట్ల ఓటమి కూడా సంభవిస్తూ 2014 నాటి స్థాయి నుంచి మోదీ ప్రజాదరణ తగ్గుతూనే వస్తోందని నిరూపిస్తున్నాయి. పనితీరు మెరుగు పరచుకోకపోతే మర్యాద దక్కదని మోదీ కాబినెట్‌ సహచరులను హెచ్చరించినట్లు వార్త వచ్చింది. మరి కొద్ది నెలల్లో బిజెపికి అంతగా బలం లేని బెంగాల్‌, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలలో ఎన్నికలు రాబోతున్నాయి. వీటితో పాటు ఎన్నికలు జరగబోయే అసాంలోనే బిజెపికి కాస్త ఆశ వుంది. ఇవన్నీ కలిసి బిజెపి పని అయిపోయిందనే సందేశం యిస్తే చాలా ప్రమాదం. అందువలన మంత్రివర్గంలో మార్పులు తెచ్చి, యిమేజి పెంచుకోవాలని చూడడంలో ఆశ్చర్యం లేదు. సదానంద గౌడ (న్యాయశాఖ), రాధామోహన్‌ సింగ్‌ (వ్యవసాయం), మహేశ్‌ శర్మ(సాంస్కృతిక వ్యవహారాలు)ల పని తీరు బాగాలేదని వారిని మారుస్తారని పుకార్లున్నాయి. 75 ఏళ్లు దాటిన నజ్మా హెపాతుల్లా (మైనారిటీలు)ను గవర్నరుగా పంపుతారని, 75 దాటిన కల్‌రాజ్‌ మిశ్రాను కూడా తీసేద్దామనుకున్నా ఆయన యుపి బ్రాహ్మణుడు కావడం చేత, యుపి ఎన్నికల దృష్ట్యా కొనసాగిస్తున్నారని అంటున్నారు. అరుణ్‌ జైట్లీ (ఫైనాన్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌), నిర్మలా సీతారామన్‌ (కామర్స్‌)ల పని తీరు ఆశించినదాని కంటె చాలా తక్కువగా వుందని అందరూ నమ్ముతున్నారు. ఎకానమీ పుంజుకోలేదు, ఎగుమతులు తగ్గాయి, సెన్సెక్స్‌ పడిపోతోంది. అందువలన జైట్లీని మారుస్తారని కొందరు, అబ్బే ఆయన మోదీకి ఆత్మీయుడు కాబట్టి ఇన్ఫర్మేషన్‌ తీసేసి ఫైనాన్స్‌ మాత్రం కొనసాగిస్తారని కొందరు అంటున్నారు. కేవలం పనితీరు గురించే అయితే జైట్లీ బాధ్యతలు కుదించరు. ఆయనపై డిడిసిఎ తాలూకు అభియోగాలు కూడా వున్నాయి కాబట్టి ఆ అంశాన్నీ లెక్కలోకి వేస్తున్నారని అనుకోవాలి.

డిడిసిఎ (ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌)కు అరుణ్‌ జైట్లీ పధ్నాలుగేళ్లు (1999-2013) అధ్యక్షుడిగా వున్న కాలంలో ఆర్థిక నేరాలు జరిగాయని ఆరోపణ. వృత్తి రీత్యా లాయరైన జైట్లీకి, క్రికెట్‌కు సంబంధం ఏమిటని అడగకూడదు. యూరోప్‌, అమెరికా వంటి దేశాల్లో స్పోర్ట్‌స్‌ బాడీస్‌కు మాజీ క్రీడాకారులు అధ్యక్షులుగా వుంటారు. ఇండియాలో మాత్రం రాజకీయనాయకులు వుంటారు. వారికి ఆ ఆట వచ్చా రాదా అని ఎవరూ అడగరు. ఆ విధంగా జైట్లీ క్రికెటే కాదు, హాకీ బోర్డులోనూ పదవిలో వున్నాడు. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వున్నాడు. ఇప్పుడు అమిత్‌ షా వున్నాడు. బిజెపి యువనాయకుడు అనురాగ్‌ ఠాకూర్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడు. ఢిల్లీ బిజెపి నాయకుడు విజయ్‌ మల్‌హోత్రా ఇండియన్‌ ఆర్చరీ (విలువిద్య) అసోసియేషన్‌కు అధ్యక్షుడు. కాంగ్రెసు నాయకుడు రాజీవ్‌ శుక్లా బిసిసిఐలో చాలాకాలం పాటు ముఖ్యమైన పదవిలో వున్నాడు. దివంగత ప్రియరంజన్‌ దాస్‌మున్షీ ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా వుండేవాడు. ఇప్పుడు అతని స్థానంలో ఎన్‌సిపి లీడరు ప్రఫుల్‌ పటేల్‌ వచ్చాడు. మరో ఎన్‌సిపి నాయకుడు శరద్‌ పవార్‌ ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు చాలాకాలంగా అధ్యక్షుడిగా వున్నాడు. వీళ్లందరికీ ఆ యా ఆటల్లో ప్రావీణ్యం కాదు కదా, ప్రవేశం కూడా వుండి వుండదు. అన్నిటి కంటె డబ్బు, పలుకుబడి దండిగా వున్నది క్రికెట్‌ ఆట. అందుకే వసుంధరా రాజె లలిత్‌ మోదీ ద్వారా రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను కైవసం చేసుకుంది. 

జైట్లీ హయాంలో డిడిసిఎలో అక్రమాలు జరిగాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే వాటివలన జైట్లీ ఆర్థికంగా లాభపడ్డాడా లేదా అన్నది యిప్పుడే చెప్పలేం. ఆయన కింద పనిచేసిన వారందరూ అవినీతిపరులే, వారిని ఆయన వెనకేసుకుని వచ్చాడు. మరి ఆ కాలంలో మొదటి ఐదేళ్లు ఎన్‌డిఏ అధికారంలో వున్నా, తర్వాతి తొమ్మిదేళ్లు యుపిఏ అధికారంలో వుంది కదా వాళ్లు యితనిపై ఏ చర్యా తీసుకోలేదేం? అనే ప్రశ్నకు సమాధానం లేదు. స్పోర్ట్‌స్‌ పేరు చెప్పి మనం తినేసినదానితో పోలిస్తే యిదెంత, దీని సంగతి ఎత్తితే మన లొసుగులు బయటపడతాయి అని యుపిఏ నాయకులు వూరుకున్నారేమో తెలియదు. నిజానికి యిది బయటకు రావడానికి కారకుడు బిజెపి ఎంపీ అయిన కీర్తి ఆజాద్‌. అతను క్రికెట్‌లోంచి రాజకీయాల్లోకి వచ్చేశాడనుకోకూడదు. రాజకీయాలు అతని రక్తంలోనే వున్నాయి. అతని తండ్రి భగవత్‌ ఝా ఆజాద్‌ బిహార్‌కు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెసు నాయకుడు. ఇతను మాత్రం బిజెపి ద్వారానే ఢిల్లీలో ఎమ్మెల్యే అయ్యాడు. బిహార్‌లోని దర్భంగా నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. కొంతమంది క్రికెట్‌ ఆటగాళ్లు జైట్లీ డిడిసిఎను జైట్లీ నిర్వహిస్తున్న తీరుపై ధ్వజం ఎత్తుతూనే వున్నారు. వారిలో ఆజాద్‌ కూడా ఒకడు కావడం చేత జైట్లీ అతనికి సీటు రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమై, అతని భార్య పూనమ్‌ ఆజాద్‌కు ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్టు రాకుండా చేయడంలో మాత్రం సఫలుడయ్యాడని అంటారు. 2009-14 మధ్య జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వుండగా ఆజాద్‌ సుష్మా స్వరాజ్‌కు సన్నిహితంగా వుండేవాడు. ప్రస్తుతం మోదీకి జైట్లీ ఆత్మీయుడిగా వుండడంతో సుష్మ ఎందుకైనా మంచిదని, ఆజాద్‌ను రక్షించే ప్రయత్నం మానుకుని దూరంగా వుంది.

2015 జులైలో ఆజాద్‌ పార్లమెంటులో డిడిసిఎ వ్యవహారాలపై విచారణ ఎలా సాగుతోందని ప్రశ్న సంధించాడు. దాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు పంపారు. అక్కణ్నుంచి హోం శాఖకు వెళ్లింది, వాళ్లు స్పోర్ట్స్‌ శాఖకు పంపారు. వాళ్లు ఏం చేయాలో తెలియక కాబోలు ఢిల్లీ ప్రభుత్వానికి పంపి తగిన చర్యలు తీసుకోమని అన్నారు. బిజెపిపై కత్తులు నూరుతున్న అరవింద్‌కు యిది అంది వచ్చిన అవకాశమైంది. వెంటనే విజిలెన్సు డిపార్టుమెంటులో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వున్న చేతన్‌ సంఘీ అధ్యక్షుడిగా, పుణ్యా శ్రీవాస్తవ, రాహుల్‌ మెహ్రాలు సభ్యులుగా అక్టోబరులో ఒక కమిటీ వేసింది. ముగ్గురూ ఐయేయస్‌లే. వారు నవంబరులో తమ నివేదిక యిచ్చారు. సంఘీ కమిటీ జైట్లీ పేరు ప్రస్తావించకపోయినా అతని హయాంలో ఆర్థికపరమైన అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. డిడిసిఎని వెంటనే సస్పెండ్‌ చేసి, విధివిధానాలను సరిదిద్దాలని (స్ట్రీమ్‌లైన్‌) సిఫార్సు చేసింది. అది జరిగేలోపు క్రికెట్‌ను వృత్తిగా స్వీకరించిన క్రీడాకారులు క్రికెట్‌ వ్యవహారాలను నిర్వహించాలంది. వెంటనే కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వేసి లోతుగా పరిశోధించాలని అంది. డిడిసిఎ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వసాయం పొందుతోంది కాబట్టి దాన్ని ఆర్‌టిఐ (సమాచార హక్కు) కింద తేవాలంది, అంతేకాదు, డిడిసిఎ ఆఫీసు బేరర్స్‌ను అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తేవాలంది. వీటితో బాటు స్పోర్ట్‌స్‌ బాడీలలో రాజకీయనాయకులను వదిలించుకోవాలని. క్రికెట్‌ ఆటగాళ్లే దాని వ్యవహారాలు చూసుకోవాలి అని స్పష్టంగా చెప్పింది. 

డిడిసిఎ యిప్పటికే సిబిఐ విచారణ ఎదుర్కుంటోంది. డిడిసిఎ అంతర్గత ఆడిట్‌ లోపభూయిష్టంగా వుంది. దానిపై ప్రశ్నలు సంధిస్తూ నవంబరు 26 న సిబిఐ ప్రిలిమినరీ ఎంక్వయిరీ (పిఇ) లెటర్‌ పంపింది. డిడిసిఎ జవాబివ్వలేదు. 2006-2012 కాలంలో డిడిసిఎ కార్యకలాపాల్లో 62 రకరకాల అక్రమాలు జరిగాయని సీరియస్‌ ఫ్రాడ్‌ యిన్వెస్టిగేషన్‌ ఆఫీసు కూడా కనుగొంది. నిధుల గోల్‌మాల్‌, పన్నులు కట్టకపోవడం, కీలక సమావేశాల్లో  దొంగ ఓట్లు వేయడం, టెండర్లు పిలవకుండా పనులు అప్పగించడం, సభ్యత్వం విషయంలో, టిక్కెట్ల అమ్మకాల విషయంలో అవినీతికి పాల్పడడం… యిలా చాలా వున్నాయి. ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో కొంతభాగం కట్టడానికి రూ. 24.26 కోట్లు అవుతుందని అంచనా వేసి పని ప్రారంభించి చివరకు రూ. 114 కోట్లు ఖర్చు పెట్టారు.  దాని మరమ్మత్తులకై టెండర్లు పిలవకుండా ఆశ్రితులైన కంట్రాక్టర్లకు రూ.57 కోట్లు యిచ్చి దానికి సరైన లెక్కలు చూపలేదని సంఘీ కమిటీ చెప్పింది. 

విధాన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, శ్రీరామ్‌ ట్రేడ్‌కామ్‌, మేపల్‌ ఇన్‌ఫ్రా రియాల్టీ అనే మూడు కంపెనీలకు డిడిసిఎ రూ.1.55 కోట్లు అప్పిచ్చినట్లు చూపారు. 'చారిటబుల్‌ కంపెనీగా ఏర్పడిన డిడిసిఎ వాణిజ్య అవసరాలకై అప్పెలా యిచ్చింది?' అని అడిగితే యిప్పటి డిడిసిఎ అధ్యక్షుడు ఎస్‌పి బన్సాల్‌ ''ఇవన్నీ యిన్వెస్ట్‌మెంట్స్‌. వడ్డీ వస్తుంది కదాని వాటిలో పెట్టాం.'' అన్నారు. వడ్డీ కోసం బ్యాంకు డిపాజిట్లలో పెట్టాలి కానీ యిలా అప్పులిస్తే రేపు ఆ కంపెనీలు దివాళా తీస్తే డిడిసిఏ పరిస్థితి ఏమిటి? డిడిసిఎ భారీ చెల్లింపులు చేసిన 9 కంపెనీలకు ఒకటే రిజిస్టర్డ్‌ ఆఫీసు, కామన్‌ డైరక్టర్లు మాత్రమే కాదు, ఒకటే ఈమెయిల్‌ ఐడీ కూడా. సంబంధిత అధికారులు ఆథరైజ్‌ చేయనిదే డబ్బులు చెల్లించకూడదు. అలాటి ఆథరైజేషన్‌ లేకుండానే సేవలందించారన్న పేరుపై లాయర్లకు, ఆడిటర్లకు, ఎకౌంటెంట్లకు విపరీతంగా డబ్బులు చెల్లించేశారు. వారందించిన సేవలేమిటని అడిగితే జవాబు రావటం లేదు. కొంతమందికి రెండేసి సార్లు డబ్బిచ్చారు. ఇలాటి డూప్లికేటు పేమెంట్స్‌ కోట్లలో వున్నాయని సంఘీ కమిటీ అంది. కమిటీ సిఫార్సుల మేరకు వెంటనే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం  డిడిసిఎకు జైట్లీ అధ్యక్షుడిగా వున్న 1999-2013 కాలంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారించడానికి ప్రసిద్ధ లాయరు గోపాల సుబ్రమణియన్‌ అధ్యక్షతన ఏకసభ్య కమిటీ నియమించింది. 

ఇవన్నీ జైట్లీని బాధించాయి. ఇప్పటిదాకా తనపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ తను రక్షిస్తూ వచ్చిన వారి కారణంగా తన పేరు మాసిపోతుందన్న భయం పట్టుకుంది. డిడిసిఎ ఫైళ్లను చేజిక్కించుకోవడానికి కాబోలు ఒక పథకం వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తున్న, అరవింద్‌కు ఐఐటీలో క్లాస్‌మేట్‌ ఐన రాజేంద్ర కుమార్‌పై సిబిఐ విచారణ ప్రారంభించారు. అతనిపై వున్న అవినీతి ఆరోపణ ఏమిటంటే 2007లో ఎండీవర్‌ సిస్టమ్స్‌ అనే సంస్థను ప్రమోట్‌ చేసి అధికారం దుర్వినియోగం చేసి దానికి రూ. 9.50 కోట్ల టెండర్లు కట్టబెట్టాడట. దానికి గాను ఆ కంపెనీ నుంచి కమిషన్లు తిన్నాడట. ఈ ఆరోపణపై సిబిఐ విచారణ చేపడితే రాజేంద్ర కుమార్‌ను తమ ఆఫీసుకి పిలిపించి ప్రశ్నించవచ్చు. రాజేంద్ర కుమార్‌ ఉన్నతస్థానంలో వుండడమే కాక 2007లో 'ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ యిన్‌ పబ్లిక్‌ ఎడ్మినిస్ట్రేషన్‌' పొంది వున్నాడు. అలాటి వ్యక్తిపై యింట్లో, ఆఫీసులో డిసెంబరు 15 న దాడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అనుమతి తీసుకోలేదు. ఇంట్లో వాళ్లకు దొరికిందేమిట్రా అంటే సీల్డ్‌ బాటిల్స్‌లో 11.75 లీటర్ల లిక్కర్‌.  తెరిచి వున్న మూడు సీసాల్లో 2.25 లీటర్ల లిక్కర్‌. మొత్తం మీద 14 లీటర్లు. ఢిల్లీ రూల్సు ప్రకారం 25 సం||లు దాటిన వ్యక్తి వద్ద 9 లీటర్ల లిక్కర్‌ వుండవచ్చు. ఆ విధంగా పరిమితి కంటె ఆయన వద్ద ఎక్కువుంది అనబోయారు ఎక్సయిజ్‌ వారు. కానీ కుమార్‌, అతని భార్య యిద్దరూ 25 సం||లు పై బడినవారే కాబట్టి యిద్దరికీ కలిపి 18 లీటర్ల వరకు పరిమితి వుంది. కొండను తవ్వి ఎలకను పట్టారని సామెత. ఇక్కడ కొంప తవ్వి సారా పట్టినట్లుంది. ఇక ఆఫీసు విషయానికి వస్తే రాజేంద్ర కుమార్‌ ఆఫీసు సోదా సాకు చెప్పి అదే ఫ్లోర్‌లో వున్న ముఖ్యమంత్రి ఆఫీసు కూడా రోజంతా మూసేసి కొన్ని ఫైళ్లు తీసుకుపోయారు. ఇదెక్కడి అన్యాయం అంటే ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లలో రాజేంద్ర కుమార్‌కు సంబంధించిన 14 చోట్ల చేశాం, వాటిల్లో యిదొకటి అంటోంది సిబిఐ. దీంతో గంగవెర్రులెత్తి పోయిన అరవింద్‌ ఏకంగా మోదీపై విరుచుకుపడి నానామాటలూ అన్నాడు. 

ఎవరేమనుకున్నా జైట్లీ యింతటితో ఆగలేదు. డిడిసిఎ అక్రమాలు బయటపెట్టిన కమిటీకి అధ్యక్షత వహించిన చేతన్‌ సంఘీపై ఎసిబి చేత ఎఫ్‌ఐఆర్‌ వేయించాడు. 2011-12 మధ్య ఢిల్లీ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌కు అతను చైర్మన్‌గా వున్న కాలంలో 350 ఇండస్ట్రియల్‌ ప్లాట్లను లీజ్‌హోల్డ్‌ నుంచి ఫ్రీ హోల్డ్‌గా మార్చడం జరిగింది. దానిలో సంఘీకి కమిషన్లు ముట్టాయని ఎసిబి యిప్పుడు అనుమానిస్తోంది. ఈ కేసు వేయగానే సంఘీ వణికాడు. తన రిపోర్టులో ఒక ముఖ్యమైన వ్యక్తి (జైట్లీ అని తాత్పర్యం) పేరు ప్రస్తావించాలని తనపై ఒత్తిడి వచ్చిందని (ఒత్తిడి చేసినవాడు అరవింద్‌ అని తాత్పర్యం), అందువలన తనను ఢిల్లీ సర్వీసు నుంచి మార్పించి, కేంద్ర సర్వీసులోకి మళ్లీ తీసుకోవాలని హోం శాఖకు లేఖ రాశాడు. హోం శాఖ ఆ అభ్యర్థనను పరిశీలిస్తోంది. కమిటీలో యితర సభ్యులు యిలాటి ఫిర్యాదు చేయలేదు. సంఘీని ఆ విధంగా లొంగదీశారు. 

ఇక రాజేంద్ర కుమార్‌పై యిప్పటివరకు సిబిఐ కచ్చితమైన ఆరోపణలు చేయలేదు. చూడబోతే యిదంతా డిడిసిఎ ఫైళ్లు కామాపు చేయడానికే అనే సందేహం అందరిలో కలిగింది. అందరూ జైట్లీవైపు వేలెత్తి చూపుతున్నారు. అతనికి ప్రశ్నలు సంధించి సిడిలు విడుదల చేసిన కీర్తి ఆజాద్‌కు పార్టీ సమాధానం చెప్పకపోగా డిసెంబరు 23 న అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి తను జైట్లీ వైపే వున్నానని చూపుకుంది. ఇదే సమయంలో హాకీ ఇండియాకు చీఫ్‌గా పని చేసిన ప్రఖ్యాత పోలీసు అధికారి కెపిఎస్‌ గిల్‌ జైట్లీపై మరో ఆరోపణ చేశారు. హాకీ ఇండియా లీగ్‌కు సలహాదారుగా వున్న తన పదవి వుపయోగించి జైట్లీ తన కూతురు సోనాలీ జైట్లీని హాకీ గవర్నింగ్‌ బాడీకి లీగల్‌ కౌన్సిల్‌గా నియమించమని ఒత్తిడి చేశాడట. బిషన్‌ సింగ్‌ బేదీ వంటి క్రికెట్‌ ఆటగాళ్లు కూడా జైట్లీపై విరుచుకు పడుతున్నారు. కానీ జైట్లీ వెనక్కి తగ్గటం లేదు. తనూ, తన కుటుంబసభ్యులు యీ లావాదేవీల వలన లాభపడ్డారంటూ 2015 డిసెంబరులో తనపై ఆప్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌పై, మరో ఐదుగురు ఆప్‌ లీడర్లపై పరువునష్టం దావా వేశాడు. ఫిబ్రవరి 3 న ఢిల్లీలో చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు జైట్లీ స్టేటుమెంటును రికార్డు చేశాడు.  తరువాతి వాయిదా ఫిబ్రవరి 15కి పడింది. ఏది ఏమైనా జైట్లీ ప్రవర్తన సందేహాస్పదంగా వుంది. డిడిసిఎలో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. అతని పదవికాలంలో జనరల్‌ సెక్రటరీగా, అతని తర్వాత అధ్యక్షుడిగా వున్న స్నేహ ప్రకాశ్‌ బన్సాల్‌ నుండి యిప్పటికే అధికారాలు లాగేసుకున్నారు. ఇంకా ఎందరో అధికారులపై, ఉద్యోగులపై విచారణ విచారణ సాగుతోంది. మన్‌మోహన్‌ సింగ్‌ లాగే అరుణ్‌ జైట్లీ స్వయంగా డబ్బు తినకపోవచ్చు కానీ తన సహచరులను తిననిచ్చాడన్నది స్పష్టంగా తెలుస్తోంది. మన్‌మోహన్‌ లాగే  అరుణ్‌ జైట్లీ ప్రతిష్ఠ కూడా మసకబారింది. అతనికి ఏదో ఒక విధంగా స్థానచలనం కలిగించకపోతే పార్టీకీ ఆ మసి అంటుతుందనే భయం వుంది కాబట్టి జైట్లీ మంత్రిత్వ శాఖ మారవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]