ఈ ప్రశ్న వేస్తే సగటు సినిమా అభిమాని వెంటనే చెప్పేమాట, రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా వుండి వుంటారని. కానీ కానే కాదట. ఎన్టీఆర్-చరణ్ వాళ్ల వాళ్ల సినిమాల్లో బిజీగా వున్నారు. ఎన్టీఆర్ ఫ్రీ కావడానికి ఇంకో మూడు నెలలు, చరణ్ రెడీ కావడానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది. అందువల్ల రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడానికి కావాల్సినంత టైమ్ వుంది.
ఈలోగా రాజమౌళి వేరే పనిలో బిజీ అయిపోయారు. అదే మగధీర సినిమా పని మీద. ఎప్పుడో విడుదలయిన మగధీర మీద ఇప్పుడేం పని? అక్కడే వుంది విశేషం. ఆ సినిమాను జపనీస్ భాషలోకి అనువదించే పని పెట్టుకున్నారు రాజమౌళి. బాహుబలి సినిమాకు జపనీస్ భాషలో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడ తన మార్కెట్ ను, క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు వీలయ్యే మగధీర ను అర్జెంట్ గా అనువదించే పని స్టార్ట్ చేసారు.
ఈ మేరకు మగధీర నిర్మాత అల్లు అరవింద్ తో ఓ డీల్ ను రాజమౌళి కుదుర్చుకున్నట్లు బోగట్టా. ఆ డీల్ ఏమిటి? లెక్కలు ఏమిటి? ఇందులో ఆర్కా మీడియా పాత్ర ఏమిటి? అన్నవి ఇంకా డిటైల్డ్ గా తెలియదు కానీ, జపనీస్ లోకి మగధీరను అనువదించే పని మాత్రం మొదలయింది. ఇప్పుడు రాజమౌళి బిజీగా వున్నది దానిపైనే.
ఇది కూడా జపాన్ వాళ్లకు నచ్చేస్తే, సోషియో ఫాంటసీ యమదొంగ ను కూడా అక్కడికి తీసుకుపోతారేమో?