వారం క్రితమే విడుదలై సంచలనం సృస్టిస్తోంది సుకుమార్-రామ్ చరణ్ రంగస్థలం. ఈ సినిమా కోసం 1980ల కాలం నాటి గ్రామీణ వాతావరణాన్ని కళ్ల ముందకు తీసుకువచ్చాడు సుకుమార్. ఇప్పుడు అదే కాలానికి చెందిన సబ్జెక్ట్ తో సినిమా చేయబోతున్నాడు దిగ్దర్శకుడు రాజమౌళి.
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, రాజమౌళి తీయబోయే ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా 1980 ఒలంపిక్స్ ఆధారంగా తయారవుతుంది. ఇద్దరు క్రీడాకారుల కథ అది. ఒకరు రామ్ చరణ్. గుర్రపు స్వారీ నిపుణుడు. మరొకరు ఎన్టీఆర్.. బాక్సర్.
వీళ్ల కథే ఇప్పుడు రాజమౌళి తీయబోయేది. ప్రస్తుతం ఎన్టీఆర్ విపరీతంగా కసరత్తులు చేస్తున్నాడు. అదంతా త్రివిక్రమ్ సినిమా కోసమే అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కాదు విషయం.
రాజమౌళి సినిమాలో బాక్సర్ లుక్ కోసమే అదంతా. గతంలో ఒకసారి యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. ఆ సినిమా రాజమౌళిదే. మళ్లీ ఇప్పుడు మరోసారి మారుతున్నాడు. అదీ రాజమౌళి కోసమే.
1980వాతావరణం, అప్పటి క్రీడలు, క్రీడా రాజకీయాలు, ఎమోషన్లు అన్నీ కథలో చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది చివరలో సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.