నా పేరు సూర్య, 2.0 సినిమాల విడుదల తేదీలకు సంబంధించి మొన్నటివరకు రచ్చ జరిగిన విషయం తెలిసిందే. నిర్మాత బన్నీ వాస్ దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎట్టకేలకు ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. బన్నీ సినిమాకు రజనీకాంత్ 2వారాల టైం ఇచ్చాడు.
ఏప్రిల్ 27న ఒకేసారి విడుదల అవుతాయనుకున్న బన్నీ, రజనీకాంత్ సినిమాల మధ్య ఇప్పుడు 2వారాల గ్యాప్ వచ్చింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 14న 2.0 సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని రజనీకాంత్ ప్రకటించడంతో 'నా పేరు సూర్య' యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
ఇంతకుముందు చెప్పినట్టే ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను విడుదల చేసుకోవడానికి బన్నీకి లైన్ క్లియర్ అయింది. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉండనే ఉంది. అదే తేదీని మహేష్ మూవీ కోసం నిర్మాత దానయ్య కూడా ప్రకటించాడు. సో.. ఇప్పుడు బన్నీ లేదా మహేష్ లో ఒకరు ఆ తేదీ నుంచి తప్పుకోవాలి.
'నా పేరు సూర్య' సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో రేపు ఓ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అందులో రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏదేమైనా రజనీకాంత్ తప్పుకోవడంతో పోటీ ఇప్పుడు బన్నీ-మహేష్ మధ్యకు షిఫ్ట్ అయింది.