రజనీకాంత్‌ పార్టీ గుర్తు ఇదేనట

తమిళ సూపర్‌ స్టార్‌, రాజకీయాలపై తనకు ప్రస్తుతానికి ఆసక్తి లేదని చెప్పారు. దేవుడు ఆదేశిస్తే మాత్రం, రాజకీయాల్లోకి వచ్చి, అవినీతి రహిత పాలనను అందిస్తానని ప్రకటించేశారు. 'నా రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాల్ని…

తమిళ సూపర్‌ స్టార్‌, రాజకీయాలపై తనకు ప్రస్తుతానికి ఆసక్తి లేదని చెప్పారు. దేవుడు ఆదేశిస్తే మాత్రం, రాజకీయాల్లోకి వచ్చి, అవినీతి రహిత పాలనను అందిస్తానని ప్రకటించేశారు. 'నా రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాల్ని నమ్మొద్దు. నా పేరు చెప్పుకొని కొందరు రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారు. అలాంటివారికి దూరంగా వుండండి. నేను ఏ పార్టీకీ మద్దతివ్వడంలేదు..' అనడం వరకూ బాగానే వుందిగానీ, 'దేవుడు ఆదేశిస్తే..' అనడమేంటట.? 

ఇక్కడే, అభిమానుల్లో మళ్ళీ కన్‌ఫ్యూజన్‌ షురూ అయ్యింది. 'అవినీతి రహిత పాలన..' అన్న మాట రజనీకాంత్‌ నోట రావడంతో, రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై కన్‌ఫ్యూజన్‌తో కూడిన చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది. త్వరలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారన్నమాట. దానికి ఇంకాస్త బలం చేకూరేలా, అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో 'ఎన్నికల గుర్తు' లాంటిదొకటి అందర్నీ ఎట్రాక్ట్‌ చేసింది. 

'బాబా' సినిమాలో, రజనీకాంత్‌, తన వేళ్ళను వెరైటీగా మడిచి, ఓ ముద్రను చూపిస్తాడు. దాన్ని 'చిహ్నం'గా మార్చేశారు. ఆ చేతి ముద్రకి కింత తెల్లని కలువని జోడించారు. ఇదే, తమ అభిమాన హీరో స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తు.. అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు హోరెత్తించేస్తున్నారు. అయితే, రజనీకాంత్‌ సన్నిహితులు మాత్రం ఈ వ్యవహారంపై పెదవి విప్పడంలేదు. 

అతిగా మద్యం తాగే అలవాటు ఒకప్పుడు తనకుండేదనీ, ఇప్పుడు మానేశాననీ రజనీకాంత్‌ చెప్పడమే కాదు, తన అభిమానులెవరూ మద్యం జోలికి వెళ్ళొద్దని సూచించడం అభినందించదగ్గ విషయమే. అయితే, 'డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేసే అభిమానులకు నా మద్దతు వుండబోదు.. సమాజం పట్ల అంకిత భావంతో పనిచేయాలి..' అని రజనీకాంత్‌ వ్యాఖ్యానించడం, అభిమానుల్లో కొంత గందరగోళానికి కారణమయ్యింది. తన సినిమాలతో రజనీకాంత్‌ కోట్లు దండుకుంటున్నప్పుడు, తామెందుకు డబ్బు సంపాదనకు దూరంగా వుండాలన్నది వారి వాదన. 

మొత్తమ్మీద, 'రాను రానంటూనే..' రజనీకాంత్‌, రాజకీయాలపై తనలో వున్న అమితాసక్తిని చాటుకుంటూనే వున్నారన్నమాట. రజనీకాంత్‌ మనసు పొరల్లో దాగి వున్న రాజకీయ ఆకాంక్ష.. భయాన్ని దాటి, బయటకెప్పుడొస్తుందో ఏమో.!