సింధు ‘కీర్తి’ని తగ్గించేస్తున్నారు.!

పీవీ సింధు ఇటీవల జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో రజత పతకాన్ని సాధించిన విషయం విదితమే. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి పీవీ సింధు. ఆమె మన తెలుగమ్మాయి కావడం, తెలుగువారందరికీ గర్వకారణం.…

పీవీ సింధు ఇటీవల జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో రజత పతకాన్ని సాధించిన విషయం విదితమే. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి పీవీ సింధు. ఆమె మన తెలుగమ్మాయి కావడం, తెలుగువారందరికీ గర్వకారణం. ప్రపంచమంతా సింధు 'కీర్తి'ని కొనియాడుతోంటే, తెలుగు జాతి యావత్తూ అమితానందంతో ఉప్పొంగిపోతోంది. సింధు ఏ పోటీల్లో పాల్గొంటున్నా, ఆమె ఆ పోటీల్లో విజయం సాధించాలనీ, తద్వారా దేశానికీ, తెలుగు జాతికీ గౌరవాన్ని తీసుకురావాలనీ ఆశిస్తూనే వున్నాం. 

అయితే, తెలుగు రాష్ట్రాలు పీవీ సింధుని 'గౌరవించడం'లో చూపిస్తున్న అత్యుత్సాహం, ఆమె 'కీర్తి'ని తగ్గించేస్తున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు తెలుగు రాష్ట్రాలు పెద్దయెత్తున 'నజరానా' ప్రకటించేశాయి. పీవీ సింధుకి, ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకం.. ఇలాంటివి అందులో వున్నాయి. ఇవి చాలవన్నట్టు, పీవీ సింధు కోసం 'ఉన్నత ఉద్యోగాల్నీ' కేటాయిస్తున్నారు. 

నిజానికి, పీవీ సింధు సాధించిన విజయాల నేపథ్యంలో, ఆమెను ఎంత గొప్పగా గౌరవించినా దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య 'పీవీ సింధుని గౌరవించడంలో' నడుస్తోన్న 'పోటీ' అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రైతులు మెడకు ఉరితాళ్ళు బిగించుకుంటున్నారు.. నిరుద్యోగులు రోడ్డున పడ్తున్నారు. వారిని ఆదుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు కనీసపాటి శ్రద్ధ పెట్టడంలేదు. అలాంటిది, పీవీ సింధు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఏకంగా చట్ట సవరణ చేసేసింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచడంతోపాటు, పీవీ సింధు పేరునీ వివాదాల్లోకి లాగేయడం సహజమే.

పీవీ సింధుని డిప్యూటీ కలెక్టర్‌ చేయాలన్న ఆలోచనని తప్పు పట్టలేంగానీ, అదే సమయంలో రైతుల సమస్యలపై కనీసపాటి చర్చ అటు ఏపీ క్యాబినెట్‌ సమావేశంలోగానీ, అసెంబ్లీలోగానీ జరగకపోవడాన్ని ఏమనుకోవాలి.? పీవీ సింధుని నిజంగానే గౌరవించాలనుకుంటే, దానికి చాలా మార్గాలున్నాయి. పీవీ సింధు పేరుతో బ్యాడ్మింటన్‌ అకాడమీలు స్థాపించొచ్చు.. పీవీ సింధు పేరుతో కళాశాలలు నిర్మించొచ్చు.. పీవీ సింధు పేరుతో వర్తమాన క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించొచ్చు.. ఇంకా ఇంకా చాలానే చేయొచ్చు. అలా చేస్తే, పీవీ సింధు కూడా గర్వపడ్తుంది. 

ఏదిఏమైనా, తెలుగు రాష్ట్రాల మధ్య ఈ 'బహుమతుల' పోటీ వెగటుపుట్టించేస్థాయికి చేరుకుందన్నది నిర్వివాదాంశం.