రామ్ చరణ్ తరచు షూటింగ్ లకు డుమ్మా కొడుతుంటారు. ఇది టాలీవుడ్ లో ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి ఇదే సమస్య మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ తో కూడా వుండేది. మహేష్ బాబు షెడ్యూలు షెడ్యూలుకు మధ్య గ్యాప్ తీసుకుని షూటింగ్ చేస్తుంటారు. ఎన్టీఆర్, బన్నీ లాంటి కొద్దిమంది మాత్రమే మొదలుపెడితే, చకచకా చేసేస్తారు. శర్వానంద్ షూటింగ్ ఎగ్గొట్టరు కానీ, షెడ్యూళ్ల ప్లానింగ్ లో కాస్త బద్దకం కనిపిస్తుంది.
అన్నింటికీ ఒకటే కారణం అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాదాపు అందరు తెలుగు టాప్ హీరోలకు ఒకటే సమస్య అని తెలుస్తోంది. అది మరేంటో కాదు. నడుంనొప్పి లేదా బ్యాక్ పెయిన్. పవన్, చరణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా అందరికీ ఈ సమస్య వుందని, అయితే పవన్, చరణ్ లకు కాస్త ఎక్కువ అని తెలుస్తోంది.
అందుకే చరణ్ తరచు షూటింగ్ లకు డుమ్మాకొడుతూ వుంటారని వినికిడి. ఒకసారి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయితే చాలా బాధ పెట్టేస్తుందని తెలుస్తోంది.
రోప్ ఫైట్ లు తెస్తున్న సమస్య
టాప్ యాక్షన్ హీరోలు అందరికీ కామన్ వస్తున్న ఈ సమస్యకు కారణం, రోప్ ఫైట్ లే అని టాక్. భారీ ఫైట్లు, గాల్లోకి ఎగరడం, మెలికలు తిరగడం ఇలా రకరకాల ఫైట్లు చేయాలి అంటే బాడీ అంతటికి తాళ్లు కట్టి, కప్పీ లేదా పుల్లీ సాయంతో బలంగా ఒకేసారి లాగడం, విడవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీరం అంతా ఒకేసారి అన్ని వైపుల నుంచి బలంగా గుంజినట్లు అవుతుంది.
దీనివల్లే బ్యాక్ పెయిన్ సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ ఫ్యాన్ కోసం, సినిమా ఫైట్ లు భారీగా వుండడం కోసం ఈ విధంగా చేయక తప్పడంలేదు. అందుకే ఇకపై రోప్ షాట్ లు మరీ అవసరం అయితే తప్ప వాడకూడదని కొందరు హీరోలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద యాక్షన్ సీన్లు, యాక్షన్ సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేయడం మాట అలా వుంచి, హీరో ఆరోగ్యాలను చెడగొడుతున్నట్లు కనిపిస్తోంది.