డైరక్టర్ సుకుమార్ తో సినిమా అంటేనే అలాగ వుంటుంది. ఒక పట్టాన పూర్తి కాదు. పెర్ ఫెక్షన్ కోసమో, మరెందుకోసమో ఆయన అలా చెక్కుతూనే వుంటారు సినిమాను. మామూలుగానే అనుకున్న డేట్ కు రెడీ కావడం కష్టం. అలాంటిది దూరంగా వాయిదా పడింది అంటే ఇంక చెక్కుడు గురించి చెప్పక్కర్లేదు.
మైత్రీ మూవీస్ సంస్థ రెండు సినిమాలు చకచకా చేసేసింది. అలాంటిది సుకుమార్ తో సినిమా పెట్టుకుని ఏడాదికి పైగా అలా డేట్ ను జరుపుకుంటూ వస్తోంది. ఆ సినిమా సంక్రాంతికి విడుదల పక్కా అనుకుంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా వచ్చిపడింది. దాంతో మార్చికి మార్చేసారు.
కానీ సినిమాను జనవరి డేట్ కే విడుదల అనే అనుకుని, ఫినిష్ చేస్తామని, సెన్సారు కాపీతో సహా రెడీ చేస్తామని నిర్మాతలు అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇంకా సినిమా తయారీ నడుస్తూనే వుందట.
పాటలు కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ దాదాపు ముగిసిపోయినా, ఇంకా మిగిలిన విషయాలు అలా నడుస్తూనే వున్నాయట. అంటే అజ్ఞాతవాసి ఒకవేళ లేకపొయివుంటే సంక్రాంతికి రంగస్థలం ముస్తాబు రెడీ అయివుండేది కాదేమో? పేరు మాత్రం ఆ సినిమా వల్ల వెనక్కువెళ్లింది అని వుండిపోయింది.