హిట్టొచ్చిందా.? లేదా.? అన్నది కాదిక్కడ ప్రశ్న. ఛాన్సులొస్తున్నాయా.? లేదా.? అన్నదే ప్రశ్న. ఆ లెక్కన రష్మి, కెరీర్లో ఊహించని సక్సెస్ సొంతం చేసుకున్నట్లే భావించాలేమో. 'కరెంట్' తదితర సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో ఒకప్పుడు సరిపెట్టేసిన రష్మి, ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతోంది. చిన్న సినిమాలకు సంబంధించినంతవరకు రష్మి ట్రంప్ కార్డ్‌లా మారిపోయింది.
చిత్రమైన విషయమేంటంటే, రష్మి ఈ మధ్యకాలంలో చేసిన ఒక్క సినిమా కూడా హిట్టవలేదు. అయినా అవకాశాలు ఆమెకు వెల్లువలా వచ్చిపడ్తున్నాయి. ఏంటీ సీక్రెట్.? అంటే, రష్మికి ఇచ్చే రెమ్యునరేషన్‌తో ఆ సినిమాకి దక్కుతున్న పాపులారిటీతో పాటు విడుదలకు ముందు సినిమాపై పెరుగుతున్న ఆసక్తిని మ్యాచ్ చూస్తే ఈక్వేషన్స్ సరిపోతున్నాయన్నది దర్శక నిర్మాతల వాదన.
రష్మితోపాటే, అనసూయ కూడా అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైనా హల్చల్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, రష్మికే ఎక్కువ మార్కులు పడ్డాయి, ఎక్కువ ఛాన్సులు కూడా దక్కాయి. హీరోయిన్గా స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం రష్మి ఏమీ ఆలోచించడంలేదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కావాలి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనే నిబంధనలు అసలే పెట్టుకోలేదు. ఐటమ్ సాంగ్ తరహాలో వున్నా ఫర్లేదు, గ్లామర్ మోతాదు మించినా ఫర్లేదు అనుకుంటోంది రష్మి.
అక్కడే రష్మి హిట్టవుతోంది. ఎక్కువకాలం రష్మి సినిమాల్లో కొనసాగుతుందా.? లేదా.? అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే రష్మి దూకుడు కొనసాగుతోంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. అందులో 'చారుశీల', 'రాణిగారి బంగ్లా' ముఖ్యమైనవి. ఇవి కాకుండా, ఇంకో అరడజను సినిమాలున్నాయట రష్మి ఓకే చేసినవి ఈ మధ్యకాలంలో.