పో..ఫో.. పోకేమాన్‌.!

కొత్త ఒక వింత.. పాత యధావిధిగా రోత.! ఇది వెనకటికి ఓ సామెత. కానీ, ఇప్పుడందరికీ వింతలే కావాలి. ఆ వింతలో ప్రమాదం వున్నా సరే, ఆ వింతలోని లోతెంతో చూసెయ్యాలి. ఈ క్రమంలో…

కొత్త ఒక వింత.. పాత యధావిధిగా రోత.! ఇది వెనకటికి ఓ సామెత. కానీ, ఇప్పుడందరికీ వింతలే కావాలి. ఆ వింతలో ప్రమాదం వున్నా సరే, ఆ వింతలోని లోతెంతో చూసెయ్యాలి. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నా సరే డోన్ట్‌ కేర్‌. స్మార్ట్‌ ఫోన్‌.. స్మార్ట్‌గా ప్రాణాలు తీసేస్తోంది. సెల్ఫీ అయితేనేం, పోకేమాన్‌ గేమ్‌ అయితేనేం.. స్మార్ట్‌ ఫోన్‌ జోలికెళితే, అట్నుంచటే పైకెళ్ళిపోవడమే. 

టెలీ కమ్యూనికేసన్ల రంగంలో విప్లవాత్మకమైన మార్పు సెల్‌ఫోన్‌తోనే సంభవించింది. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకీ ఎంతో తేడా. 'మీ ఫోన్‌లో కెమెరా వుందా.?' అని గొప్పగా మాట్లాడుకునే రోజులవి. ఇప్పుడు 'బోడి మొబైల్‌ కెమెరా.. మీ ఫోన్‌లో ఫలానా యాప్‌ వుందా.?' అనే మాటలు విన్పిస్తున్నాయి. 

పది వేల నుంచి లక్ష రూపాయలదాకా.. ఒక్కోసారి ఇంకా ఎక్కువ. ఎవడి బలుపుకు తగ్గట్టుగా అన్నట్లు మొబైల్‌ పోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. 'స్మార్ట్‌' అనే మాట కొత్తగా వాడనక్కర్లేదిప్పుడు. ఎందుకంటే వున్నవాటిల్లో మెజార్టీ స్మార్ట్‌ పోన్లే గనుక. పల్లెటూళ్ళు, పట్నం అన్న తేడాలు కూడా లేవు. సిటీ కల్చర్‌లో కన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. 

ఇంకేం, స్మార్ట్‌ ఫోన్లతో స్మార్ట్‌గానే జనాల ప్రాణాలు కూడా పోతాయి. పెరుగుట విరుగుట కొరకే కదా మరి.! దేన్నయినాసరే, సరిగ్గా వాడితే సమస్యలుండవు. అతిగా వాడితేనే అనర్ధాలు. అతి సర్వత్ర వర్జయేత్‌.. అని పెద్దలు ఊరకే అన్నరా.? పెద్దలు చెప్పిన హెచ్చరికలు చాలానే వున్నాయ్‌. మనమే దేన్నీ పాటించబోం. అదీ మన బుద్ధి. కాదు కాదు, నయాట్రెండ్‌ అలాంటిది. 

మొన్నీమధ్యనే ఓ బీటెక్‌ కుర్రాడు వేగంగా వస్తున్న ట్రైన్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో చూపించాలనుకుని సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. అంతే, సెల్ఫీ రాలేదు.. ట్రైన్‌ వచ్చేసింది. కుర్రాడి ప్రాణం పోయింది. ఇరవయ్యేళ్ళ కుర్రాడ్ని తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి వుండాలి. క్షణికానందం అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఎవరన్నా రెచ్చగొట్టారా.? పిచ్చి పీక్స్‌కి వెళ్ళిందా.? కారణం ఏదైతేనేం, భావి భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటివి నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. అయినా మారం గాక మారం. ఎందుకంటే, మనం నయా ట్రెండ్‌లో కొట్టుమిట్టాడుతున్న స్మార్ట్‌ సన్నాసులం. 

కొత్తగా పోకేమాన్‌ గో అనే వీడియో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలో హల్‌చల్‌ చేస్తోంది. మార్కెట్‌లోకి వచ్చి కొద్ది రోజులే అయ్యింది. కానీ, ఇప్పటికే ఈ గేమ్‌ చాలామంది ప్రాణాల్ని తీసేసింది. చిత్రంగా వుంది కదూ.! గేమ్‌ని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే, ఆ తర్వాత గేమ్‌ ఆడేయొచ్చు.. ప్రాణాలు పోగొట్టేసుకోవచ్చు. ఆ గేమ్‌ కూర్చుని ఆడేది కాదు, అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాలంతే. ఇదో వెరైటీ గేమ్‌. అందుకే మరి, ఫోకస్‌ ఫోన్‌ మీద వుంటోంది తప్ప, ప్రమాదం మీద వుండటంలేదు. వెరసి, ప్రమాదానికి ఎదురెళుతున్నారు 'స్మార్ట్‌' వ్యసనపరులు. 

ఇండియాలో ఇప్పటికే పోకేమాన్‌ గేమ్‌ చాపకింద నీరులా విస్తరించేసింది. దాంతో, తాపీగా పోలీసులు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల్ని హెచ్చరిస్తున్నారు. 'రోడ్లు ప్లే గ్రౌండ్స్‌ కాదు..' అంటూ ముంబై పోలీస్‌, స్మార్ట్‌ ఫోన్‌ వాడకందార్లకు ట్విట్టర్‌ ద్వారా క్లాస్‌ తీసుకున్నారు. మనం వింటామా.? చచ్చినా వినం.! ఎందుకంటే మనం స్మార్ట్‌ పిచ్చాళ్ళం. పిచ్చి పీక్స్‌కి వెళ్ళిపోయిందంతే.!