ఎన్టీఆర్ కథానాయకుడు ఏ రేంజ్ లో ఆడిందో అందరం చూశాం. దానికి వచ్చిన నష్టాల్ని పూడ్చలేక, పార్ట్-2ను అమ్ముకోలేక నిన్నటి వరకు నానా కష్టాలు పడ్డారంతా. మొత్తానికి ఎలాగోలా పార్ట్-2 మహానాయకుడు విడుదలకు అన్ని సెటిల్ మెంట్స్ పూర్తిచేశారు.
తెరవెనక ఈ వ్యవహారాన్ని పక్కనపెడితే, తెరపై కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం బాలయ్యను నమ్ముకుంటే పని జరగదని క్రిష్ కు అర్థమైపోయింది. అందుకే ఈసారి రానాను తెరపైకి తీసుకొచ్చాడు. మహానాయకుడు సినిమాకు సంబంధించి బాలయ్యను కాస్త పక్కనపెట్టి, రానాకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాడు.
మహానాయకుడు రిలీజ్ డేట్ పోస్టర్లలో ఎక్కడ చూసినా రానానే కనిపిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం విడుదలకానున్న ట్రయిలర్ లో కూడా డామినేషన్ రానాదే ఉండొచ్చనే ఫీలర్లు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే మహానాయకుడు సినిమా పూర్తిగా రానా క్రేజ్ పైన విడుదలవుతున్నట్టు లెక్క. బాలయ్యకు ఇది అచ్చంగా అవమానమే.
మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ చిన్నల్లుడు చంద్రబాబు పాత్రలో కనిపించబోతున్నాడు రానా. అయితే ఇది అందరికీ తెలిసిన వెన్నుపోటు పాత్ర కాదు. ఎన్టీఆర్ కు కుడిభుజంగా ఉంటూ, రాజకీయాల్లో ఎన్టీఆర్ ను దగ్గరుండి నడిపించే పెద్దమనిషి పాత్ర. ఇలాంటి బూటకపు పాత్రతో మహానాయకుడు సినిమాను రానా ఎలా గట్టునపడేస్తాడో చూడాలి.
అన్నట్టు కథానాయకుడు దెబ్బతో మహానాయకుడులో కొన్ని మార్పుచేర్పులు చేశారు. ఇందులో భాగంగా తొలిభాగంగా కాస్తోకూస్తో ఆదుకున్న ఎన్టీఆర్-ఏఎన్నార్ ఎపిసోడ్ ను పార్ట్-2లో కూడా కొనసాగించారు.