రోజా సినిమాతో ఏ ఆర్ రెహమాన్ సర్రున ఇండస్ట్రీలోకి దూసుకువచ్చేసరికి తెలుగు వారికి కూడా అతనితో సినిమా చేయించాలనిపించింది. దాంతో అప్పట్లో రెండు సినిమాలు రెహమాన్ అందించాడు. సూపర్ పోలీస్ (వెంకటేష్) గ్యాంగ్ మాస్టర్ (రాజశేఖర్) అంటూ రెండు సినిమాలు వచ్చాయి. పాటలు ఓకె కానీ సినిమాలు డిజాస్టర్. ఆ తరువాత అడపా దడపా పల్నాటి పౌరుషం, నీ మనసు నాకు తెలుసు (తరుణ్) లాంటి పేర్లు వినిపించాయి.. అంతే.
ఆ తరువాత గట్టిగా రెహమాన్ పేరు వినిపించిన సినిమా నాని. మహేష్ బాబు కెరీర్ లో భయంకరమైన డిజాస్టర్లలో ఇదీ ఒకటి. ఆ తరువాత మళ్లీ చాన్నాళ్లకు అదే డైరక్టర్ పవన్ కళ్యాణ్ తో పులి సినిమా చేసాడు. దీనికీ రెహమాన్ నే పని చేసారు. మళ్లీ రిజల్ట్ డిటో డిటో.
తెలుగు తమిళ భాషల్లో చేసిన ఏమాయ చేసావె మాత్రమే రెహమాన్ కు చెప్పుకోవడానికి తెలుగులో మిగిలింది. ఆ మధ్య అలాగే రెండు భాషల్లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా ఫ్లాపే.
పైగా రెహమాన్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లిపోయాక, మెలోడీని వదిలేసారు. ఒకప్పుడు రెహమాన్ పాటలు అంటే అవో అద్భుతం. కానీ ఇప్పుడు నోటికి తిరగమన్నా తిరగనట్లు చేస్తున్నారు. గడచిన అయిదారేళ్లలో ఆయన చేసిన హిట్ సాంగ్ లు చాలా అంటే చాలా తక్కువ. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ మాత్రం రెహమాన్ ప్లస్ పాయింట్. అవి కూడా ఒక్కోసారి ఆయన సినిమాలకు ఆయన చేయరు. వేరేవాళ్లకు ఇచ్చిన సందర్భాలు వున్నాయి.
మరి ఇప్పుడు రెహమాన్ మరోసారి తెలుగు సినిమాలోకి వచ్చారు. చిరు 151వ ప్రతిష్టాత్మక చిత్రం సై..రా కు ఆయనే సంగీత దర్శకుడు. ఈసారి అయినా రెహమాన్ మంచి హిట్ సాంగ్స్ ఇస్తారని అభిమానుల ఆశిస్తున్నారు.