జియో రాకతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్నాయి ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు. ఇప్పుడు వాటికి మరో దెబ్బ తగలబోతోంది. ఈసారి ఇంకాస్త గట్టిగా. అవును.. జియో వచ్చినా, కస్టమర్లు తరలిపోయినా ఈ రెండు కంపెనీలకు ఇంటర్-కనెక్టివిటీ చార్జీల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ ఆదాయానికి కూడా గండి పడబోతోంది.
జియో వాయిస్ కాల్స్ కు వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలకు చెందిన క్యారియర్స్ ను రిలయన్స్ ఉపయోగించుకుంటోంది. ఇది సహజం కూడా. అన్ని సంస్థలు ఇలా చేస్తుంటాయి. ఇలా వాడుకున్నందుకు ప్రతి కంపెనీ, మరో సంస్థకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా టెలికం కంపెనీలకు ఏటా 6వేల 7వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈ విషయంలో జియోనే మిగతా కంపెనీలకు అధిక స్థాయిలో చెల్లింపులు చేస్తోంది. ఇప్పుడీ చార్జీలు రద్దుకాబోతున్నాయి.
ఇంటర్ కనెక్టివిటీ చార్జీల పేరిట ఇతర కంపెనీలు తమను మోసం చేస్తున్నాయని ట్రాయ్ ను చాన్నాళ్ల కిందటే ఆశ్రయించింది జియో. ఆ వాదనను ఇప్పుడు ట్రాక్ పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే 50శాతం ఇంటర్-కనెక్టివిటీ చార్జీల్ని తగ్గించబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత కొన్ని రోజులకు మిగతా భారాన్ని కూడా తగ్గించే అవకాశాలున్నాయని ట్రాయ్ అధికారులు అంటున్నారు.
ఇదే కనుక జరిగితే రోజురోజుకు కస్టమర్లను పెంచుకుంటున్న జియోకు ఇది తీపివార్తే. త్వరలోనే 4జీ హ్యాండ్ సెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో జియోకు మరింతమంది యూజర్లు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్ లో ఇంటర్-కనెక్టివిటీ చార్జీలు తీసేస్తే.. అది జియోకు ఎంతో లాభం. మిగతా కంపెనీలకు మరింత భారం.