శ్రీకాకుళం జిల్లాకు తితిలీ తుపాను మిగిల్చిన తుపాను విషాదం ఇంతా అంతా కాదు. ఈ విషాదానంతరం ప్రభుత్వం ఓ పక్క చేస్తున్న హడావుడి వుండనే వుంది. దానిపై ప్రభుత్వ అనుకూల మీడియా హడావుడి కూడా అలాగే వుంది. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలు ఎక్కడా సరైన సాయం బాధితులకు అందడం లేదని విమర్శలు చేస్తున్నాయి.
ఈ వ్యవహారాలు ఇలా వుండగా మెల్లగా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కదులుతోంది. సాయం ప్రకటించేవారు ప్రకటిస్తున్నారు. కేరళ టైమ్ లో అంత స్పీడ్ గా మన స్వంత గడ్డ శ్రీకాకుళం అంటే మన సినిమా జనాలు ముందుకు రావడంలేదు. ఉత్తరాంధ్ర రైట్స్ అంటూ అక్కడ జనాల జేబుల్లోంచి కోట్లకు కోట్లు కొల్లగొడుతోంది సినిమా ఇండస్ట్రీ. కానీ హీరోలు కావచ్చు, మిగిలిన పెద్దలు కావచ్చు. అంత చురుగ్గా మాత్రం స్పందించడం లేదన్నది వాస్తవం.
అందరికన్నా ముందుగా అతిచిన్న హీరో సంపూర్ణేష్ బాబు స్పందించి తన వంతు సాయం ప్రకటించారు. ఆ తరువాత హీరో నిఖిల్ తన బృందంతో నేరుగా శ్రీకాకుళం వెళ్లి మూడురోజుల పాటు అక్కడ పర్యటించి, రకరకాలుగా సాయం అందించారు. ఆ తరువాత మరి కొందరు హీరోలు నేరుగా సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు సాయం అందించారు.
కానీ ఇప్పుడు స్టయిలిష్ హీరో అల్లుఅర్జున్ తనవంతు సాయం పాతిక లక్షలు ప్రకటించారు. కానీ సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, శ్రీకాకుళానికి చెందిన అభిమానుల ద్వారా ఎక్కడ సాయం కావాలో? విషయం సేకరించి, నేరుగా బాధితులకు సాయం అందించే అయిడియాలో బన్నీ వున్నారని తెలుస్తోంది.
బన్నీ ఈ దారిలో వున్నారంటే మిగిలిన మెగా హీరోలు కూడా ఇదే దారి పట్టే అవకాశం వుంది. హీరోలు నేరుగా సాయం అదించాలని నిర్ణయించడానికి కారణం ఏమిటి? నిజమో కాదో కానీ ఓ విషయం వినిపిస్తోంది. సెలబ్రిటీలు సిఎమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తుంటే అది సరిగ్గా వెళ్లడం లేదని అంటున్నారు. ఈ విషయం హీరోల దృష్టికి రావడం వల్లే ఇలా చేస్తున్నారని అంటున్నారు.
పైగా మెగా హీరోలు అంతా పవన్ కళ్యాణ్ వెనుక అండగా వున్నారు. పవన్ ఇప్పుడు అధికారపక్షానికి వ్యతిరేకంగా వున్నారు. మరి అందుకోసమే, సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వకుండా నేరుగా సాయం చేయాలని అనుకుంటున్నారేమో?
మొత్తంమీద ఇకపై టాలీవుడ్ నుంచి సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు నేరుగా సాయం అందరూ కాకుండా కొందరే చేస్తారేమో?