తెలుగునాట జనాలపై చెరగని ముద్ర వేసిన ఇద్దరు రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్. నటుడిగా కూడా తెలుగు ప్రజలపై ముద్ర వేయగలిగిన అదృష్టం ఎన్టీఆర్ స్వంతమైంది. అలాంటి ఇద్దరు గొప్పవాళ్ల బయోపిక్ లు తెరకెక్కబోతున్నాయి. జూలై నుంచి ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమవుతుంది. జూన్ 18నుంచి వైఎస్ బయోపిక్ 'యాత్ర' ప్రారంభమవుతుంది.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి విడుదల టార్గెట్ చేసుకుని రెడీ అవుతున్నాయి. 'ఎలా షెడ్యూలు చేస్తారో? ఎలా ఫినిష్ చేస్తారో? అంతా మీ ఇష్టం. విడుదల మాత్రం సంక్రాంతికే' అని బాలయ్య ఒకటే మాట క్రిష్ కు చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇప్పటికే వైఎస్ బయోపిక్ యూనిట్ కూడా తమ సినిమా విడుదల సంక్రాంతికే అని ఫిక్సయిపోయింది. పైగా వైఎస్ బయోపిక్ ఓ డిఫరెంట్ ప్రయత్నం. అది పూర్తిగా వైఎస్ చరిత్ర చూపేది కాదు. వైఎస్ జీవితంలోని కీలక అథ్యాయం అయిన పాతయాత్రను తెరకెక్కించే ప్రయత్నం. అందులో భాగంగానే, కాస్త వెనక్కు వెళ్లి, కొద్దిగా వైఎస్ జీవితాన్ని కూడా టచ్ చేస్తారు.
కానీ ఎన్టీఆర్ బయోపిక్ అలా కాదు. స్టార్టింగ్ నుంచి, ఎన్టీఆర్ నటుడిగా ఎదుగుదల, మైలురాళ్లయిన సినిమాలు, పాత్రలు, ఆపై రాజకీయ రంగప్రవేశం, చైతన్య యాత్ర, అధికార సాధన వరకు వుంటుంది.
అంటే ఒక విధంగా రెండింటిలోనూ 'యాత్ర'లు, అనంతరం అధికారం చేపట్టడమే క్లయిమాక్స్ గా వుంటుంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కు వర్క్ ఎక్కువ. పాత్రలు ఎక్కువ. వ్యవహారం. ఎక్కువ. కానీ వైఎస్ బయోపిక్ కు ఏడు నెలల సమయం వుంటే, ఎన్టీఆర్ బయోపిక్ కు ఆరునెలలే సమయం.
అయితే క్రిష్ చాలా ఫాస్ట్ గా, ప్లాన్డ్ గా, సినిమా తీస్తారు. అందువల్ల సమయం అన్నది పెద్ద సమస్య కాకపోవచ్చు. సో, ఇటు చైతన్యయాత్ర, అటు పాదయాత్ర, సంక్రాంతి వేళకు థియేటర్లలో జనాలకు ఒకేసారి కనువిందు చేయబోతున్నాయన్నమాట.