ఒక్క రోజు తేడాతో జనం ముందుకు వస్తున్న రెండు మెగా సినిమాల విలువ యాభై కోట్లకు పైగానే. ఈరెండు సినిమాలు కలిసి కనీసం యాభై కోట్ల షేర్ వసూలు చేస్తేనే నిర్మాతలు గట్టెక్కేది. మరోపక్క సీనియర్ హీరో మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమా బరిలో వుండనే వుంటుంది.
వరుణ్ తేజ్-రాశీఖన్నా నటించిన తొలి ప్రేమ సినిమాకు 16కోట్ల వరకు అన్నీ కలిపి బడ్జెట్ అయింది. ఈసినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ను దిల్ రాజు 18కోట్లకు తీసుకున్నారు. అంటే ఆయనకు విడుదల ఖర్చులు అన్నీ కలిపి ఇరవై కోట్ల వరకు వెనక్కు రావాలి.
అయితే వరుణ్ తేజ్ ఫిదా సినిమా ఒక్క నైజాంలోనే 18కోట్లు వసూలు చేసింది. ఆ భరోసా వుంది. ఈసినిమాకు ఓవర్ సీస్, మల్టీ ఫ్లెక్స్ లు బలం. అయితే వన్ వీక్ తిరగకుండానే వచ్చేవారం నాని అ! సినిమా, అలాగే సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాలు విడుదలవుతున్నాయి. అవి కూడా ఇదే తరహా మల్టీ ఫ్లెక్స్ సినిమాలు.
సాయిధరమ్ తేజ్-లావణ్య త్రిపాఠి నటించిన ఇంటిలిజెంట్ సినిమాకు దర్శకుడు వివి వినాయక్ పేరు తోడయింది. దాంతో 27కోట్ల వరకు బిజినెస్ చేసారు. కొన్ని అమ్మకాలు, మరి కొన్ని అడ్వాన్స్ లు, కొంత స్వంత విడుదల ఇలా రకరకాలుగా. ఏమైతేనేం ఈసినిమా కూడా ఆ మేరకు వసూళ్లు సాగించాలి. సినిమా ఎంటర్ టైన్ మెంట్ పండితే ఇక పట్టలేకపోవచ్చు. బి సి సెంటర్లలో దూసుకుపోతుంది.
కానీ రొటీన్, రొట్ట అన్న టాక్ పొరపాటున వచ్చిందో జనం పక్కన పెట్టేస్తున్నారు ఈమధ్య. టచ్ చేసి చూడు పరిస్థితి అదే. మరి ఇంటిలిజెంట్ ఎలా వుంటుందో చూడాలి. సాయిధరమ్ పెద్ద హిట్ సుప్రీమ్ టోటల్ వసూళ్లు పాతిక కోట్లకు కాస్త దగ్గరగా. మరి ఈసినిమా మరో అయిదు కోట్లు అదనంగా రాబట్టాలి.
అంటే దాదాపు రెండు సినిమాలు కలిసి బయ్యర్లు అయితేనేం, ఎగ్జిబిటర్లు అయితేనేం రాబట్టాల్సింది యాభై కోట్లు. ఓ సింగిల్ పెద్ద సినిమాకు అయితే పెద్ద సమస్య కాదు. వన్ వీక్ లో ముఫై నలభై కోట్లు రాబట్టేయవచ్చు. కానీ ఇవి రెండు మీడియం రేంజ్ సినిమాలు. ఎలా నెట్టుకువస్తాయో చూడాలి.