వివాదాస్పద కథలు, టైటిళ్లతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈసారి నేరుగా మెగాకాంపౌండ్ నే టార్గెట్ చేశాడు. తన కొత్త సినిమాకు మెగా ఫ్యామిలీ అనే పేరు పెట్టారు. మరిన్ని వివరాల్ని మరికాసేపట్లో ప్రకటించబోతున్నాడు వర్మ. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న వర్మ, ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే మెగా ఫ్యామిలీ స్టార్ట్ అవుతుందని ప్రకటించాడు.
మెగా కాంపౌండ్ కు వర్మకు ఎప్పుడూ పడదనే విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి, పవన్ లాంటి మెయిన్ స్ట్రీమ్ హీరోలు వర్మపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ.. నాగబాబు, రామ్ చరణ్ లాంటి వాళ్లు మాత్రం వర్మపై సెటైర్లు వేశారు. నాగబాబు తన యూట్యూబ్ వీడియోల్లో డైరక్ట్ గానే వర్మను తిట్టగా.. ఓ సినిమా ఫంక్షన్ లో రామ్ చరణ్, వెంట్రుక కూడా పీకలేరు అంటూ పరోక్షంగా డైలాగ్ కొట్టాడు.
వీటికితోడు గతంలో చిరంజీవి హీరోగా వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. ఆ విషయం ఇప్పటికీ చాలామందికి గుర్తు. అలా మెగా కాంపౌండ్ కు రామ్ గోపాల్ వర్మకు మధ్య చాలా దూరం పెరిగింది. గత ఎన్నికల టైమ్ నుంచి పవన్, చిరంజీవి పై వరుసగా ట్వీట్లు పెడుతూ విమర్శలు చేస్తున్న వర్మ, ఈసారి ఏకంగా మెగా హీరోలు, మెగా కాంపౌండ్ పై సినిమా తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించాడు.
మెగా కాంపౌండ్ సినిమా అంటే సహజంగా చిరంజీవి, అల్లు అరవింద్, పవన్, నాగబాబు, రామ్ చరణ్, అల్లుఅర్జున్, వరుణ్ తేజ్, అల్లుశిరీష్ పాత్రలన్నీ ఉంటాయి. ఈ పాత్రలన్నింటినీ వర్మ తన సినిమాలో చూపిస్తాడా లేక చిరంజీవి-పవన్-నాగబాబు వరకే సినిమాను పరిమితం చేస్తాడా అనే విషయం మరికొద్దిసేపట్లో తేలనుంది.
తనకు, మెగా కుటుంబానికి మధ్య ఉన్న అభిప్రాయబేధాల్ని పక్కనపెడితే.. పరిశ్రమలో మెగా కాంపౌండ్ ఎలా ఆధిపత్యం చలాయించింది, కొన్ని సినిమాల్ని, కొంతమంది హీరోల్ని ఎలా తొక్కేసింది లాంటి విషయాల్ని మాత్రం వర్మ తప్పకుండా చర్చించబోతున్నాడు.