పబ్లిసిటీ ట్రిక్స్, టెక్నికల్ జిమ్మిక్స్ మినహా పూర్తిగా ఔట్ డేటెడ్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ సడెన్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఎందుకు తెరపైకి తెస్తున్నాడు. ఆయన అనౌన్స్ చేసిన సగం ప్రాజెక్ట్ లు ఇంకా అటక మీద చోటు చాలక కొట్టుకుంటున్నాయి. అలాంటి వాటిల్లోంచి ఎన్టీఆర్ బయోపిక్ ని మాత్రం ఏరికోరి బూజు దులిపి కిందకు దించాడు వర్మ.
ఇదంతా కేవలం ఎన్టీఆర్ బయోపిక్ కు వస్తున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న మరో చీప్ ట్రిక్ గానే చెప్పుకోవాలి. తేజ చేతిలో నుంచి క్రిష్ దగ్గరకి వచ్చేసరికి ఎన్టీఆర్ బయోపిక్ పై బజ్ అమాంతం పెరిగిపోయింది. రోజురోజుకీ విడుదలవుతున్న స్టిల్స్, వీటిలో నటిస్తున్న ప్రముఖులు అంచనాలను పెంచుతున్నారు.
ఈ దశలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా పోటీగా తెరపైకి తెస్తే బిజినెస్ బాగుంటుందని అనుకున్నాడేమో అర్జెంట్ గా తన ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తానంటూ ముందుకొచ్చాడు వర్మ. లక్ష్మీపార్వతి అనే ఎపిసోడ్ ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు విడుదలైన కొద్ది రోజుల గ్యాప్ లో తన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేలా మహూర్తం నిర్ణయించాడు.
అంటే క్రిష్ సినిమాకు వచ్చే ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్రేజ్ వచ్చేలా ముందే ప్లాన్ చేసుకున్నాడు వర్మ. తొలిసారి సినిమాకు పూజ చేస్తా, తిరుపతిలో ఓపెనింగ్ ఫంక్షన్ అంటూ చేస్తున్న హడావిడి కూడా పక్కా పబ్లిసిటీ స్టంటే.
అసలు వర్మలో పస అయిపోయిందని ఎప్పుడో తేలిపోయింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను వర్మ డీల్ చేసే విధానం కూడా జనాలకు ఏమాత్రం నచ్చడం లేదు. రక్తపాతం, విపరీతమైన క్రైమ్.. రక్తచరిత్రను గట్టెక్కించింది కానీ ఆ తర్వాత వర్మ తీసిన ఏ బయోపిక్ కూడా వర్కవుట్ కాలేదు.
వంగవీటి సినిమా విషయంలో రీసెర్చ్ చేస్తున్నానంటూ వర్మ చేసిన హడావుడికి వచ్చినంత హైప్ కూడా రిలీజైన సినిమాకు రాలేదు. తాజాగా చేసిన ఆఫీసర్ అసలు వర్మ సినిమాలు థియేటర్లో చూడ్డానికి వెళ్లాలా అనేంతగా ప్రేక్షకుల్ని, ఆయన అభిమానుల్ని కూడా సందిగ్ధంలో పడేశాయి.
ఆ లెక్కన చూసుకుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కేవలం వివాదాల కోసం తీస్తుందే తప్ప ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. టైమ్ కోసం ఎదురుచూస్తున్న వర్మకి, ఎన్టీఆర్ బయోపిక్ కి వస్తున్న క్రేజ్ అడ్వాంటేజీగా మారింది. ఆ క్రేజే ఇప్పుడు 'లక్ష్మి'ని పరుగులు పెట్టిస్తోంది.