ఎవరైనా వాళ్లకు అవసరం వున్నపుడు రిక్వెస్ట్ చేయాలి. కానీ దర్శకుడు రాజమౌళి అలా అనుకోవడం లేదు. తన సినిమా వస్తుంటే వాళ్లే తప్పుకుంటారు అని అనుకుంటున్నట్లుంది. అది మహేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆఖరికి ప్రభాస్ అయినా. అందుకే ఆయన మానాన ఆయన జనవరి 8 అనే డేట్ మనసులో పెట్టుకుని సమాచారం ఇస్తున్నారు.
నిజానికి ఆరు నూరైనా అక్టోబర్ కే వస్తాం…జనవరి సినిమాలను డిస్ట్రబ్ చేయం అని గతంలో రాజమౌళి మాట ఇవ్వడం వల్లే మహేష్-సర్కారువారి పాట, పవన్ కళ్యాణ్-భీమ్లానాయక్, ప్రభాస్-రాధేశ్వామ్ లను సంక్రాంతికి డేట్ లు వేసుకున్నారు. అలాగే ఇంకా ఎఫ్ 3, బంగార్రాజు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ డేట్ లు వేసాక కూడా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కే అన్నారు తప్ప సంక్రాంతికి అనలేదు.
కానీ ఇప్పుడు తీరా చేసి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, సింపుల్ గా జనవరి 8న వస్తున్నాం అంటున్నారు. అప్పుడు కూడా ఫోన్ లు చేసి, 'వాయిదా వేసుకోవడానికి వీలు అవుతుందా' అని అడగడం లేదు. జస్ట్ వస్తున్నాం అని సమాచారం ఇస్తున్నారు.
అంటే తమ ఆర్ఆర్ఆర్ వస్తే పవన్ కళ్యాణ్ సినిమా అయినా పక్కకు పోవాల్సిందే. మహేష్ సినిమా అయినా తప్పుకోవాల్సిందే అనే ధీమా కావచ్చు. లేదా రాజమౌళి తరువాత సినిమా మహేష్ తో అందువల్ల ఆయన కాదనరు. ప్రభాస్ కు ఎలాగూ రాజమౌళితో అనుబంధం వుంది. అందువల్ల ఆయన ను ఒప్పించడం కష్టం కాదు. అనే ఆలోచన.
అందుకే నిర్మాత దానయ్య సింపుల్ గా మైత్రీ జనాలకు ఫోన్ చేసి జనవరి 8న వస్తున్నాం, ఏమీ అనుకోకండి అని చెప్పి ఊరుకున్నారు. అలాగే మరొకరు భీమ్లానాయక్ నిర్మాతలకు ఫోన్ చేసి 'మాకు తప్పలేదు..జనవరి 8న వస్తున్నాం' చెప్పేసారు.
మహేష్ కు మొహమాటం వుండొచ్చు..ప్రభాస్ కు పరిచయం అడ్డు రావచ్చు. కనీసం పవన్ కళ్యాణ్ కు ఏమిటి? మొహమాటం. తనకేం అవసరం వాయిదా వేయడానికి అని ఆలోచించాలి కదా? కానీ నిర్మాతలు పవన్ కు చెప్పకుండానే ఆర్ఆర్ఆర్ కు తలవొంచే సూచనలు కనిపిస్తు్నాయి.