టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన నాలుగేళ్ల కిందటి డ్రగ్స్ కేసు ఇవాళ్టి నుంచి మళ్లీ తెరపైకి రాబోతోంది. గతంలో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేసి వదిలిపెట్టిన ఈ కేసును, ఇప్పుడు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) దర్యాప్తు చేయబోతోంది. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి డబ్బు ఎలా చేతులుమారింది.. ఎవరి ఎకౌంట్ నుంచి ఎవరి ఎకౌంట్ కు లావాదేవీలు జోరుగా జరిగాయనే కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈరోజు పూరి జగన్నాధ్ విచారణతో డ్రగ్స్ కేసు ఎంక్వయిరీ పార్ట్-2 మొదలుకాబోతోంది.
మరికొద్దిసేపట్లో దర్శకుడు పూరి జగన్నాధ్, ఈడీ అధికారుల ముందు హాజరుకాబోతున్నాడు. పూరిని అడగాల్సిన ప్రశ్నలపై ఇప్పటికే జాబితా సిద్ధమైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి, 2 నెలల కిందటే విచారణ మొదలుపెట్టింది ఈడీ. నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరించి, వాళ్లు ఇచ్చిన డేటా ఆధారంగా మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రముఖులకు నోటీసులిచ్చింది. ఇందులో మొదటి వ్యక్తి పూరి జగన్నాధ్.
విదేశీ ఎకౌంట్లకు నిధులు మళ్లించినట్టు రుజువైతే, ఫెమా చట్టాన్ని కూడా ఉపయోగించాలని చూస్తోంది ఈడీ. ఈ మేరకు ప్రముఖుల ఎకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో పాటు, వాళ్ల ఆస్తుల్ని ఎటాచ్ చేసే అధికారి ఈడీకి ఉంది. మరోవైపు ఎక్సైజ్ పోలీసులు కూడా ఈ కేసులో ఈడీకి సహకరిస్తున్నారు. నాలుగేళ్ల కిందటి విచారణ వివరాలన్నింటినీ అందజేశారు.
ఈరోజు పూరి జగన్నాధ్ ను విచారించనున్న ఈడీ అధికారులు, రేపు ఛార్మిని ప్రశ్నించబోతున్నారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించబోతున్నారు. ఆ తర్వాత రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ లను విచారించబోతున్నారు.
ఇలా మొత్తం 12 మందిని మనీ లాండరింగ్ కోణంలో ప్రశ్నించబోతోంది ఈడీ. వీళ్ల ఎకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇప్పటికే ఈడీ వద్ద ఉన్నాయి.