రుద్రమదేవి నగల కథ ఏమైంది?

కోటిరూపాయిలకు పైగా విలువైన నగలు పోయాయని ఒక్కసారి గుప్పుమంది. అది కూడా ఓ సినిమా షూటింగ్ లో. కానీ మర్నాటి నుంచి దానిపై వార్తలు లేవు. అసలు రుద్రమదేవి అనే సినిమాకు అచ్చంగా నిజం…

కోటిరూపాయిలకు పైగా విలువైన నగలు పోయాయని ఒక్కసారి గుప్పుమంది. అది కూడా ఓ సినిమా షూటింగ్ లో. కానీ మర్నాటి నుంచి దానిపై వార్తలు లేవు. అసలు రుద్రమదేవి అనే సినిమాకు అచ్చంగా నిజం బంగారం నగలే వాడుతున్నారా అన్నది ఓ అనుమానం. రుద్రమదేవి లాంటి సినిమాకు అచ్చంగా నిజం బంగారు నగలే వాడాలంటే, ఒక కోటితో సరిపోదు. ఎందుకంటే చారిత్రాత్మక సినిమాల్లో ఆడ, మగ అందరు నటులకు భారీ నగలే వుంటాయి మరి. పోనీ కొన్ని నగలే పోయాయి అనుకుంటే, వాటికి భీమా వుందా లేదా? అన్నది మరో ప్రశ్నం. ఇంత విలువైన వాటికి భీమా చేయించకుండా వుండరు కదా? 

ఇటు పోలీసులు కానీ అటు నిర్మాత కమ్ దర్శకుడు గుణ శేఖర్ కానీ ఈ విషయమై పెదవి విప్పడం లేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారట. అది ఏ మేరకు నిజమో తెలియదు కానీ, అనుమానంపై ఓ ప్రముఖ నగల దుకాణానికి చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని,  ఆ ఉద్యోగి దగ్గర కొన్ని నగలు దొరికాయని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ నగలు ఈ సినిమాకు సంబందించినవా కాదా..కాకుంటే, ఆ ఉద్యోగి దగ్గర అంత భారీ నగలు ఎందుకున్నాయి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. 

ఏదైనా పోలీసులు అన్ని విధాలా దర్యాప్తు పూర్తి చేసి, రికవరీ చేసి, నిందితులను అరెస్టు చూపిస్తే తప్ప, అసలు వివరాలు బయటకు రావు. చిన్న చిన్న విషయాలకు ప్రెస్ మీట్ లు, ప్రెస్ రిలీజ్ లు ఇచ్చే నిర్మాణ వర్గాలు ఇలాంటి పెద్ద విషయాలకు మాత్రం మౌనం పాటిస్తాయి..అస్సలు పబ్లిసిటీ కోరుకోవు..ఎందుకో మరి..