నందమూరి తారక రామారావు జీవితాన్ని వెండితెర కావ్యంగా మలిచే ప్రయత్నానికి దిగడమే ఒక సాహసం. యావత్ తెలుగుజాతి జీవితంలో దైవసమానుడిగా ముద్రపడిపోయిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి జీవితాన్ని తిరిగి మరో రూపంలో చెప్పేలా సృజించడం అంటేనే సాహసం. అలాంటి సాహసానికి బాలకృష్ణ పూనుకున్నారు.
తన తండ్రి జీవితకథను చిత్రంగా మలచడానికి ‘ఎన్టీఆర్’ టైటిల్ తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా తేజను తప్పించిన దగ్గరినుంచి.. ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించే సామర్థ్యం గల వ్యక్తి ఎవరా? అనే విషయంలో అనేక రకాల పుకార్లు వస్తున్నాయి.
తేజను తప్పించిన తర్వాత.. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలకృష్ణ అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకత్వ పర్యవేక్షణ చేయాల్సిందిగా సీనియర్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ను సంప్రదించారు. బాలయ్యే దర్శకత్వం వహిస్తారని అనుకోవడం కంటె.. చంద్రసిద్ధార్థ్ పేరు వార్తల్లోకి వచ్చిన తరువాత.. ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.
చంద్రసిద్ధార్థ ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన పనిలో ఇన్వాల్వ్ అయిపోయారు. కథాచర్చల్లో కూర్చుంటున్నారు. సెట్స్ మీదకు వెళ్లడానికి కూడా సిద్ధం అవుతున్నారు.
‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయ’ వంటి చిత్రాలంటేనే.. వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని సమగ్రంగా వెండితెరపై ప్రతిబింబించిన చిత్రాలుగా ప్రేక్షకలోకానికి గుర్తుంటాయి. ఆయా చిత్రాల్లో ప్రధాన పాత్రలు దశాబ్దాల తర్వాత కూడా ప్రేక్షకులకు ఎంతగా గుర్తుండిపోయేలా దర్శకుడు చంద్రసిద్ధార్థ మలిచారో అందరికీ తెలుసు. ‘ఎన్టీఆర్’ చిత్రం కూడా ఒక వ్యక్తి జీవితాన్ని చిత్రించడమే గనుక.. కథకు న్యాయం చేయగలరని బాలకృష్ణతో పాటు చిత్ర నిర్మాతలు కూడా నమ్మినట్లుగా సమాచారం.
అందుకే ఆయనను తొలినుంచి సంప్రదిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించకపూర్వం అనేక వడపోతల తర్వాత.. సిద్ధం చేసిన తుదిజాబితాలో చంద్రసిద్ధార్థ పేరు కూడా ఉంది. చివరి సమయంలో తేజ రంగంలోకి రావడంతో, చంద్రసిద్ధార్థను వెనక్కి నెట్టారు. కానీ, తేజను తప్పించగానే, ఫస్ట్ ప్రాబబుల్ గా చంద్రసిద్ధార్థ ఈ చిత్ర రూపకల్పన పనిలోకి వచ్చేశారు.
ఇప్పటికే స్టోరీ సిటింగుల్లో ఆయన రెగ్యులర్ గా ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ.. దర్శకుడి విషయంలో మార్పు చేర్పులు జరుగుతున్నట్లుగా అనేక పుకార్లు వస్తున్నాయి. ‘మహానటి’ విడుదల తర్వాత దర్శకుడు నాగ్అశ్విన్ ను సంప్రదించినప్పటికీ.. ఆయన నో చెప్పేశారు. ఇంకా క్రిష్ పేరు పుకార్లలో నానుతున్నప్పటికీ.. ఆ పేర్లన్నిటినీ సినిమా ప్రారంభానికి ముందే.. తుది వడపోతకు ముందే బాలకృష్ణ తొలగించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మహానటి తర్వాత.. ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని బాలకృష్ణ పక్కన పెడుతున్నట్లుగా కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే ఇది నిజం కాదని.. మరింత జాగ్రత్తగా దీనిని రూపొందించాలని మాత్రమే బాలకృష్ణ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సమాంతరంగా వివి వినాయక్ చిత్రాన్ని చేయాలని బాలయ్య అనుకోవడం కూడా అందుకే అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.