త్రివిక్రమ్ ఓకే.. రాజమౌళి సంగతేంటి?

పుట్టిన రోజులకు ఫస్ట్ లుక్స్ సహజమే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఓ ఫస్ట్ లుక్ రెడీ అయిపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం రిలీజ్…

పుట్టిన రోజులకు ఫస్ట్ లుక్స్ సహజమే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఓ ఫస్ట్ లుక్ రెడీ అయిపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రేపు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయబోతున్నారు. మరి రాజమౌళి సంగతేంటి?

రాజమౌళి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతోంది ఆ మల్టీస్టారర్. మరి ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఏమైనా మెటీరియల్ రెడీ చేశాడా..? ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కొత్త విషయం చెప్పబోతున్నాడా..?

తన సినిమాలో నటీనటుల పుట్టిన రోజులకు స్పెషల్ లుక్స్ విడుదల చేయడం రాజమౌళికి అలవాటు. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల టైమ్ లో ఇదే పనిచేశాడు. ఎన్టీఆర్ బర్త్ డేకు కూడా రాజమౌళి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఆ మధ్య కాలిఫోర్నియాలో సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పై టెస్ట్ కట్ జరిగింది. కావాలంటే అందులోంచి ఓ స్టిల్ ను విడుదల చేయొచ్చు. 

ఇప్పట్నుంచే స్టిల్స్ విడుదల చేయడం ఇబ్బంది అనుకుంటే.. కనీసం మల్టీస్టారర్ మూవీకి సంబంధించి స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని రాజమౌళి ముందే చెప్పేస్తాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోందనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. కావాలనుకుంటే దీనిపై రాజమౌళి క్లారిటీ ఇవ్వొచ్చు. ఎటొచ్చి తారక్ పుట్టిన రోజుకు రాజమౌళి కూడా ఏదో ఒకటి షేర్ చేస్తే బాగుంటుందనేది అభిమానుల కోరిక.