వామ్మో.. ప్రీ రిలీజ్ బిజినెస్సే రూ.వంద కోట్లా!

సింగం సీరిస్ లో మూడోదిగా వస్తున్న ఎస్-3 ప్రీ రిలీజ్ బిజినెస్ సౌతిండియా రికార్డులను షేక్ చేస్తోంది. ఈ పరపరంలోని ఇది వరకటి సినిమాలు హిట్టైన నేపథ్యం, సూర్యకు ఉన్న స్టార్ డమ్ ఈ…

సింగం సీరిస్ లో మూడోదిగా వస్తున్న ఎస్-3 ప్రీ రిలీజ్ బిజినెస్ సౌతిండియా రికార్డులను షేక్ చేస్తోంది. ఈ పరపరంలోని ఇది వరకటి సినిమాలు హిట్టైన నేపథ్యం, సూర్యకు ఉన్న స్టార్ డమ్ ఈ సినిమా ప్రీ రిలీజ్  బిజినెస్ మార్కును వంద కోట్ల రూపాయల రేంజ్ చేరుస్తోందని సమాచారం. తమిళ, తెలుగు వెర్షన్లను కలిపి చూస్తే.. విడుదలకు ముందే ఈ సినిమా వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

తమిళ వెర్షన్ థియేటరికల్ రైట్స్ ను రూ.42 కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. తమిళనాడు రాష్ట్ర పరిధిలో విడుదల రైట్సే ఈ మొత్తం పలికాయి. తమిళ్ వెర్షన్ ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా రేట్లు  అదనం. తమిళ వెర్షన్ కర్ణాటక విడుదల హక్కులు ఐదు కోట్ల పై మాటేనేట! ఇక ఈ సినిమా కేరళ రిలీజ్, మలయాళం డబ్బింగ్ హక్కులను కేరళలోని సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ సొంతం చేసుకుందని ప్రకటించారు. ఇలా ఒక హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక సినిమా విడుదల హక్కులను పొందడటం ఇదే తొలిసారట! వారి నుంచి దాదాపు పది కోట్ల రూపాయల వరకూ సమకూరిందని సమాచారం.

ఇక తమిళ మార్కెట్ కు ధీటుగా సూర్యకు తెలుగునాట ఫాలోయింగ్ ఉంది. కొన్ని సినిమాలతో అది డౌన్ అయినా, ‘24’ తో సూర్య పరిస్థితి మళ్లీ మెరుగైంది. అందులోనూ సింగం తొలి రెండు పార్టులూ  తెలుగులో హిట్టే. ఆఖరికి మెగా పవర్ స్టార్ గా పేరున్న చరణ్ కూడా ‘సింగం-3’ తో పోటీ పడటానికి ఇష్ట పడటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తెలుగులో ప్రిరిలీజ్ బిజినెస్ పాతిక కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఇక తెలుగు, తమిళ వెర్షన్ల శాటిలైట్ కు బంపర్ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో.. థియేటరికల్ బిజినెస్ + శాటిలైట్ కలుపుకుంటే.. సింగం-3 విడుదలకు ముందే వంద కోట్ల మార్కును రీచ్ అయినట్టని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రీ రిలీజ్ బాగానే ఉంది .. మరి పోస్ట్ రిలీజ్ పరిస్థితే ఎలా ఉంటుందో! అరుపులూ కేకల సినిమా మూడో వెర్షన్లో ఏ  మేరకు ఆకట్టుకుంటుందో!