బాహుబలి చిత్రాలు బాలీవుడ్‌లోను ప్రకంపనలు సృష్టించి వుండొచ్చు. బాహుబలి 2 హిందీ చిత్రాలు కూడా అందుకోలేని రికార్డులు నెలకొల్పి వుండొచ్చు. అలా అని ప్రభాస్ చేసే సినిమాలన్నిటికీ అదే స్థాయిలో ఆదరణ వుంటుందని అనుకోవడానికి లేదు. బాహుబలి చిత్రానికి 'రాజమౌళి' బ్రాండింగ్‌తో పాటు కాస్టూమ్ డ్రామా కావడం పెద్ద ప్లస్ అనేది ఎవరైనా అంగీకరించాల్సిందే. బాలీవుడ్ మార్కెట్ వచ్చింది కాబట్టి ప్రభాస్ చేసే సినిమాలన్నిటికీ యూనివర్సల్ అప్పీల్ వుండాలని అతని బృందం భావిస్తోంది.
సాహో చిత్రాన్ని చిన్నగా ప్లాన్ చేసిన వారే ఆ తర్వాత బడ్జెట్ పెంచుతూ పోయారు. బాలీవుడ్ అప్పీల్ కోసమని ఈ చిత్రంలో నటీనటుల్లో చాలా మందిని హిందీ చిత్ర రంగం నుంచి తెచ్చుకున్నారు. సంగీతం బాధ్యతలు కూడా బాలీవుడ్ త్రయం 'శంకర్, ఎహ్‌సాన్, లాయ్'కి అప్పగించారు. అయితే సినిమా మరో రెండున్నర నెలలలో విడుదల కానుంది అనగా వారి మ్యూజిక్ తెలుగువారి అభిరుచికి తగ్గట్టు లేదని రియలైజ్ అయి వారిని తొలగించారు.
ఇంకోవైపు ఇంత భారీ చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలనే దానిపై అస్సలు క్లారిటీ కనిపించడం లేదు. ఇంతవరకు విడుదల చేసిన పోస్టర్లు కానీ, ఇతర కాంటెంట్ కానీ అంతగా ఆకర్షించలేదు. ప్రభాస్ కాబట్టి తెలుగునాట క్రేజ్ ఎలాగో వుంటుంది. కానీ ఈ చిత్రానికి ఎలాంటి అప్పీల్ కోసమని ఇంత స్కేల్‌లో చేసారో అదయితే ఇంతవరకు కానరాలేదు. ట్రెయిలర్లు, పాటలు విడుదలయితే ఇతర ప్రాంతాల్లోను క్రేజ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు.