చంద్రబాబు… ఇక జోడు గుర్రాల సవారీ!

జోడుగుర్రాల స్వారీ మంచిది కాదని పెద్దలు అంటూ ఉంటారు. కానీ, ఏపీ ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత.. చంద్రబాబునాయుడు మాత్రం జోడుగుర్రాల స్వారీనే ఎంచుకుంటున్నారు. పరాజయభారం తెలియకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి ఇలాంటి ఎత్తుగడను…

జోడుగుర్రాల స్వారీ మంచిది కాదని పెద్దలు అంటూ ఉంటారు. కానీ, ఏపీ ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత.. చంద్రబాబునాయుడు మాత్రం జోడుగుర్రాల స్వారీనే ఎంచుకుంటున్నారు. పరాజయభారం తెలియకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి ఇలాంటి ఎత్తుగడను అనుసరిస్తున్నారా? లేదా, ఏపీలో మొహం చెల్లక వారంలో సగం హైదరాబాదులో గడిపేయడానికి ఇదొక మార్గంగా భావిస్తున్నారా? అనేది మాత్రం అర్థంకావడం లేదు.

ఏపీలో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే… చంద్రబాబునాయుడు అమరావతిని విడిచి హైదరాబాదుకు వెళ్లిపోయారు. నాలుగురోజులు ట్రిప్ అని ప్రకటించారు. అక్కడ హైదరాబాదులో పార్టీ మీటింగు పెట్టుకుని… తెలంగాణ తెదేపాను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేయడానికి ఇక కంకణబద్ధుడనై పనిచేస్తానంటూ చంద్రబాబు వారికి హామీ ఇచ్చేశారు. అందుకోసం వారంలో రెండు రోజుల పాటూ హైదరాబాదులోనే ఉంటూ తెలంగాణ పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తూ ఉంటానని కూడా  ఆయన సెలవిచ్చారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సర్వభ్రష్టత్వం చేయించి, పూర్తిగా పతనం చేయించింది స్వయంగా చంద్రబాబునాయుడే అని చెప్పాలి. ఈ పనిని ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు చాలాకాలం ముందునుంచే పూర్తిచేశారు. ఇప్పుడంటే వారానికి రెండురోజులు తెలంగాణ తెదేపా ఉద్ధరణకు కేటాయిస్తా అని సెలవిస్తున్నారు గానీ… గతంలో నెలకు ఓసారి పార్టీ వ్యవహారాలను చూసుకుంటా అని వారికి హామీ ఇచ్చారు.

కానీ.. ఏనాడూ ఆ హామీలు అమలుకాలేదు. తెలంగాణ పార్టీ సమీక్షలు ఆయన నిర్వహించింది లేదు. ఇక్కడి పార్టీ వ్యవహారాలను నివేదించడానికి ప్రతిసారీ నాయకులు అమరావతికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లినా అపాయింట్ మెంట్ దొరక్క, దొరికినా చాలినంత సమయం కేటాయించక వారు ఈసురోమంటూ వెనక్కి తిరిగివచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తీరా ఇప్పటికి… వారానికి రెండురోజులు తెలంగాణకు కేటాయించడానికి ఆయన తనకు సమయం దొరికింది అంటున్నాడు.

కానీ ఈలోగా తెలంగాణ తెదేపా పూర్తిగా భ్రష్టమైపోయింది. పార్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు సభ్యత్వ నమోదులకు శ్రీకారం అంటే… ఏదో లెక్క రాసుకోవాల్సిందే తప్ప.. పార్టీకి జవసత్వాలు వస్తాయని అనుకోనక్కర్లేదు. పైగా తెలంగాణ తెదేపాతో కాంగ్రెస్ కు ఊడిగం చేయించి, చంద్రబాబు పార్టీని మరింత నాశనం చేశారు. ఇప్పుడు మళ్లీ ఇక లేపి నిలబెడతా అని ఆయన అంటే తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు మాత్రం ఎలా నమ్మగలరు? అక్కడ ఏపీలో పనిలేదు గనుక, ఇలాంటి ఆపద్ధర్మ డైలాగులు వేస్తున్నారే తప్ప నిజంగా తెలంగాణ తెదేపా మీద ప్రేమతో కాదని వారు అనుమానిస్తే తప్పేం ఉంది.

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం