డిసెంబర్లో సమంత పెళ్ళంట.. అందుకే సినిమాలేవీ ఒప్పుకోవడంలేదంట.. పెళ్ళికొడుకు ఎవరో కాదు, అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య అంట.. ఇంకేముంది, హీరోయిన్గా సమంత కెరీర్ ముగిసినట్లేనంట..
ఇలా గత కొద్దికాలంగా కుప్పలు తెప్పలుగా గాసిప్స్ విన్పిస్తున్నాయి సమంత గురించి. 'త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నా.. ఆ వ్యక్తి ఎవరో కాదు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే..' అంటూ సమంత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అటూ ఇటూగా ఇచ్చిన క్లారిటీతో, ఒక్కసారిగా పెద్ద దుమారమే చెలరేగింది. అంతకు ముందే సమంత – నాగచైతన్య చెట్టాపట్టాలేసుకు తిరుగుతన్నారంటూ గాసిప్స్ తెరపైకి వచ్చాయి. సమంత క్లారిటీతో, ఆమెకి నాగచైతన్యతో పెళ్ళి ఖాయమనే ప్రచారం జరిగింది.
ఇంకోపక్క, నాగార్జున కూడా నాగచైతన్య పెళ్ళి విషయమై సానుకూలంగా వున్నాడనీ, ఈ విషయం సన్నిహితుల ద్వారా బయటకు పొక్కిందన్న వార్తలు తెరపైకొచ్చాయి. ఇంతకీ, ఇదంతా నిజమేనా.? మళ్ళీ సస్పెన్స్. ఈలోగా సమంత – నాగచైతన్య చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఫొటోలు ఎడా పెడా మీడియాలో దర్శనమిచ్చేశాయి. 'జనతా గ్యారేజ్' సమంతకి చివరి సినిమా.. అన్న గుసగుసలు గుప్పుమంటున్న వేళ, సమంత కెరీర్ మీద క్లారిటీ ఇచ్చేసింది.
'జనతా గ్యారేజ్' నా చివరి సినిమా కాదు, ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను.. అని సమంత స్పష్టం చేసింది. కానీ, పెళ్ళి విషయంలో మాత్రం సమంత ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడం గమనార్హం. అంటే, సమంత – నాగచైతన్య మధ్య వ్యవహారం హుళక్కేనా.? లేదంటే అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా సమంత సస్పెన్స్ మెయిన్టెయిన్ చెయ్యాలనుకుంటోందా.? ఏమో మరి, ఆమెకే తెలియాలి.