‘కబాలి’ని కూడా భయపెట్టేస్తోందా.?

దానికి రజనీకాంత్‌ సినిమా ఏంటి.? సల్మాన్‌ఖాన్‌ సినిమా ఏంటి.? పవన్‌కళ్యాణ్‌ సినిమా ఏంటి.? ఇంకేదన్నా సినిమా అయితే ఎంటి.? ఏ సినిమా అయినా సరే దాని దెబ్బకు 'బేర్‌' మనాల్సిందే. సినీ పరిశ్రమకు 'క్యాన్సర్‌'లా…

దానికి రజనీకాంత్‌ సినిమా ఏంటి.? సల్మాన్‌ఖాన్‌ సినిమా ఏంటి.? పవన్‌కళ్యాణ్‌ సినిమా ఏంటి.? ఇంకేదన్నా సినిమా అయితే ఎంటి.? ఏ సినిమా అయినా సరే దాని దెబ్బకు 'బేర్‌' మనాల్సిందే. సినీ పరిశ్రమకు 'క్యాన్సర్‌'లా తయారయ్యిందది. అదే పైరసీ. ఈ జబ్బుకి మందు లేక కాదు, వున్నా ఆ మందుని సరిగ్గా ప్రయోగించరంతే. 

ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ముందుగా నిర్మాత గుండెల్లో రైళ్ళు పరిగెత్తేస్తున్నాయి. ఇదివరకటిలా కాదు, ఇప్పుడు మరీ దారుణం. సినిమా రేపు రిలీజ్‌ అవుతోందనగా, ఈ రోజు రాత్రే సినిమా ఆన్‌లైన్‌లో దొరికేస్తోంది. చాలామంది దాన్ని క్యాష్‌ చేసేసుకుంటున్నారు. సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిపోవడం, లేదంటే పార్టులు పార్టులుగా సినిమా ఆన్‌లైన్‌లో దొరికేయడం సర్వసాధారణమైపోయింది. 

తాజాగా ఈ భయం 'కబాలి'ని కూడా వెంటాడుతోంది. తమ సినిమా పైరసీ కారణంగా చచ్చిపోయే అవకాశముందని ఆందోళన చెందుతున్న 'కబాలి' ప్రొడ్యూసర్‌ కలైపులి థాను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిర్మాత ఇంత దయనీయ స్థితుల్లోకి వెళ్ళిపోతాడని ఎవరూ ఊహించి వుండరు కదూ.! పేరులో 'పులి' వున్నా, పైరసీకి భయపడక తప్పని పరిస్థితి. ఆన్‌లైన్‌లో 'కబాలీ' లీకైందట.. అన్న గాసిప్స్‌కి అయితే కొదవే లేదు. ఈ గాసిప్స్‌తోనే 'కబాలి' నిర్మాతకు టెన్షన్‌ పట్టుకుందట. 

అర్థరాత్రి షో పడితే చాలు, షో పూర్తయిన పది నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పైరసీ వీడియో దొరికేస్తోన్న రోజులివి. దీన్ని ఆపగలమా.? ఆపలేమని కాదు, కానీ దురదృష్టవశాత్తూ అది కనాకష్టం.. సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వస్తే తప్ప, పైరసీని అడ్డుకోలేమంతే.!