పెళ్లి తేదీ అయితే ఖరారైంది కానీ, పెళ్లి వేదిక ఏదో మాత్రం ఇంకా ఖరారు కాలేదని అంటున్నాడు నాగచైతన్య. తన వివాహం గురించి ఈ హీరో మరోసారి స్పందించాడు. అక్టోబర్ ఆరో తేదీన పెళ్లి జరగబోతోందని ప్రకటించాడు. అయితే డెస్టినేషన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవడమా లేక హైదరాబాద్ లో భారీ ఎత్తున వేడుక నిర్వహించుకోవడమా.. అనే విషయమై ఇంకా ఏం నిర్ణయించుకోలేదని చైతూ అంటున్నాడు.
ఇక ఇదే సమయంలో.. తమ పెళ్లిపై బయల్దేరిన రూమర్లకు చైతూ చెక్ చెప్పాడు. వివాహ వేడుకకు చైతూ, సమంతలే ఫండింగ్ చేయనున్నారని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని చైతూ స్పష్టం చేశాడు. తమ పెళ్లికి తామే ఫండింగ్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం కానీ, అలా అనుకోవడం కానీ ఏమీ లేదని నాగచైతన్య స్పష్టం చేశాడు.
ఒకవేళ ఆ మాట మాట్లాడితే తన తండ్రి నాగార్జున హర్ట్ కావొచ్చని కూడా చైతూ అన్నాడు. సహజమే కదా.. నాగార్జున లాంటి సంపాదన పరుడు, కోటీశ్వరుడు.. తన కొడుకు పెళ్లికి తనే ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేయాలని కోరుకుంటాడు. చైతూ, సమంతలు కూడా సంపాదన పరులు.. స్వతహాగా కోట్లు సంపాదించిన వాళ్లే అయినప్పటికీ.. పెళ్లి ఖర్చు వారు పెట్టుకుంటామంటే నాగార్జున ఒప్పుకోడు కదా.
పెళ్లి ఖర్చు గురించి తమకేం సంబంధం లేదని.. ఇరువురి పేరెంట్స్ మాట్లాడి ఆ విషయంలో ఒక అభిప్రాయానికి వస్తారని చైతూ వ్యాఖ్యానించాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో.. ఎక్కడికైనా దూరంగా వెళ్లి చేసేసుకోవాలనే ఉంది కానీ, ఇంట్లో వాళ్లను కూడా అర్థం చేసుకోవాలి.. వారికి అనుగుణంగా పెళ్లి వేడుకగా జరగాలి కదా.. అనే లాజిక్ కూడా చైతూ, సమంతల నుంచి వినిపిస్తోంది.