యూటర్న్ సినిమాకు కలెక్షన్లు లేకపోయినా ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలు సమంతకు బాగా నచ్చాయి. అందుకే ఇకపై కూడా ఇలాంటి ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టుల్నే ఎంచుకోవాలని సమంత డిసైడ్ అయింది. ఇందులో భాగంగా త్వరలోనే ఆమె మరో ప్రాజెక్టు చేయబోతోంది. దీనికి నందిని రెడ్డి దర్శకురాలు.
కొరియన్ భాషలో సూపర్ హిట్ అయిన మిస్ గ్రానీ సినిమాను సమంత తెలుగులో రీమేక్ చేయబోతోందంటూ చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే ప్రాజెక్టును సమంత సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు సమంత మామ సురేష్ బాబు కూడా అంగీకరించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు నందినీరెడ్డి ఇందులో కొన్ని మార్పులు చేస్తోంది. లక్ష్మీ భూపాల ఈ సినిమాకు మాటలు అందించబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా లాంఛ్ అవుతుంది.
వచ్చే నెలలో నాగచైతన్యతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలి అనే సినిమా చేయబోతోంది సమంత. మిస్ గ్రానీ రీమేక్ ఓకే అయితే, ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తుంది.