ఈమధ్య గమనిస్తే సమంత పక్కన ఎప్పుడు చూసినా దర్శకురాలు నందినీరెడ్డి కనిపిస్తోంది. ఓ కొరియన్ సీడీ పట్టుకొని సమంత వెంటపడిన నందినీరెడ్డి, ఎట్టకేలకు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. మిస్ గ్రానీ రీమేక్ లో నటించడానికి సమంత ఒప్పుకుంది. త్వరలోనే సినిమా ప్రారంభంకానుంది.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. తన కుటుంబానికి బరువుగా మారిన 74 ఏళ్ల వృద్ధురాలు, హఠాత్తుగా 20 ఏళ్ల యువతిగా మారుతుంది. అలా మారిన అమ్మాయి తన జీవితాన్ని, కుటుంబాన్ని, పరిస్థితుల్ని ఎలా మార్చుకుందనే ఫాంటసీ కథతో తెరకెక్కింది మిస్ గ్రానీ సినిమా. ఇప్పుడీ సినిమా తెలుగులోకి రాబోతోంది.
మిస్ గ్రానీలో 74 ఏళ్ల వృద్ధురాలిగా, 20 ఏళ్ల పడుచు పిల్లగా 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతోంది సమంత. మరోవైపు ఈ సినిమాలో హీరోగా నటించడానికి నాగశౌర్య ఒప్పుకున్నాడు. గతంలో నందినీరెడ్డి-నాగశౌర్య కాంబినేషన్ లో కల్యాణ వైభోగమే అనే సినిమా వచ్చింది.
సమంత-నాగశౌర్య కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. కాకపోతే పూర్తిగా సమంత చుట్టూ తిరిగే ఈ కథలో నటించడానికి నాగశౌర్య ఎందుకు ఒప్పుకున్నాడో ఎవరికీ అర్థంకావడం లేదు.