బాహుబలి విజయం తరువాత ప్రభాస్ తలకెత్తుకున్న ప్రాజెక్టు సాహో. రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాకు కీలకమైనది అరబ్ కంట్రీస్ లో షూట్ చేయాల్సిన భారీ ఛేజింగ్ సీన్.
ఇప్పుడు ఈ ఛేజింగ్ సీన్ కే సమ్యసలు ఎదురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఖర్చుతో, విదేశీ సాంకేతిక నిపుణులతో ఈ ఛేజ్ ను, యాక్షన్ సీన్లు ప్లాన్ చేసారు. ఈ ఒక్క ఎపిసోడ్ కే భారీగా ఖర్చవుతుందని గతంలో వార్తలు వచ్చాయి.
అయితే దుబాయ్, అబుదాబి తదితర ప్రాంతాల్లో ఎక్కడ హైవేల మీద షూట్ చేయాలన్నా, అక్కడి అధికార వర్గాల నుంచి అనుమతులు లభించలేదని తెలుస్తోంది. అనుమతులు లభించడం పెద్ద కష్టం కాకపోవచ్చని అనుకుని, ముందుగా కనుక్కోకుండా ప్లాన్ చేసేసారు. ఇప్పుడు ఇబ్బంది అయింది.
సాహొ టీమ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, దాంతో సెట్ వేసుకోవడం తప్ప మరో మార్గం లేదని వినిపిస్తోంది. తప్పనిసరిగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ రోడ్ ను తాత్కాలికంగా నిర్మించి, గ్రీన్ మ్యాట్ వేసి, గ్రాఫిక్స్ జోడించుకోవడం తప్ప మరో మార్గం లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ఇలా చేయడం వల్ల రియలిస్టిక్ లుక్ రాకపోగా, టైమ్ కూడా వేస్ట్ అవుతుందని టాక్. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ కు టైమ్ తినేస్తుందని, ఖర్చుపెరుగుతుందని టాక్.
2019 సమ్మర్ ను టార్గెట్ గా చేసుకుని సాహోను రెడీ చేస్తున్నట్లు బోగట్టా. ఇది పూర్తయితే ప్రభాస్ ఓ తెలుగు సినిమా, ఓ బాలీవుడ్ సినిమా చేయాల్సి వుంది. ఆ మేరకు కమిట్ అయ్యాడు.