'సర్దార్ గబ్బర్‌సింగ్'లాంటి డిజాస్టర్ తర్వాత కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరచింది. బాబీ మొదటి సినిమా 'పవర్' అంతంత మాత్రంగానే ఆడినా కానీ స్టార్ హీరోలతో పని చేసే అవకాశాలు అతడిని వరిస్తున్నాయి. అయితే స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం లేకపోవడం, దర్శకుడిగా గుర్తింపు లేకపోవడంతో బాబీని స్టార్ హీరోలు సీరియస్‌గా తీసుకోవడం లేదు.
'సర్దార్ గబ్బర్‌సింగ్'కి దర్శకుడిగా బాబీ పేరు వేసినా, మూడు యూనిట్లు పెట్టి వేర్వేరు దర్శకులు తీసేసారు. 'జై లవకుశ'కి అలా వేరే యూనిట్ ఏమీ లేకపోయినా కానీ బాబీ మాట చెల్లడం లేదని మాత్రం వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఏ సీన్ వుండాలి, ఏది తీసేయాలి అనేది ఎన్టీఆర్ డిసైడ్ చేస్తున్నాడని, పాటలు, ఫైట్ల చిత్రీకరణ సమయంలో బాబీ అసలు సెట్లోనే వుండడం లేదని టాక్ వుంది.
ఏ ఫోటోలు విడుదల చేయాలి, టీజర్ ఎలా కట్ చేయాలి అనే విషయాలపై కూడా దర్శకుడికి అసలు పవర్ లేదట. పూర్తిగా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ చేతుల మీదుగానే అన్నీ జరుగుతున్నాయని, 'యాక్షన్, కట్' చెప్పడం మినహా బాబీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న ఈ పుకార్ల నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అయినా కానీ బాబీకి తగిన గుర్తింపు వస్తుందో లేదో మరి.