నిజంగా ముహుర్తబలం అంటారే..అలాంటి సమస్య ఏదో వెన్నాడుతున్నట్లుంది గబ్బర్ సింగ్ 2 అలియాస్ సర్దార్ గబ్బర్ సింగ్ ను. ఏనాడి ప్రాజెక్టు..ఎక్కడ వుంది..ఎప్పటికి అవుతుంది? సంపత్ నంది వెళ్లిపోయాడు. చాన్నాళ్లు వెయిట్ చేసి, మరో సినిమా చూసుకుని, దాదాపు దాన్ని ఫినిష్ చేసేస్తున్నాడు. ఆ మధ్యలోనే ఓ చిన్న సినిమా కూడా చేసేసాడు.
కానీ ఇది మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంది. సరే బాబి అలియాస్ రవీంధ్ర వచ్చాడు. కానీ మాటల రచయిత అయిన బాబి మాటలే నచ్చక, బుర్రా సాయిమాధవ్ వచ్చి చేరాడు. అంటే మాటల రచయితగా బాబి అవుట్ అన్నమాట. స్క్రిప్ట్, కథ ఎలాగూ పవన్ బాబువే. ఇక మిగిలింది డైరక్షన్. అంటే ఒక విధంగా రెండో వికెట్ అన్నమాట.
హీరోయిన్ గా అమీషా అంబ్రోస్ అనుకున్నారు..కాస్త రీళ్లు తిప్పారు. ఠాట్..బాలేదనుకున్నారు. అవుట్..మూడో వికెట్. కాజల్ వచ్చి చేరింది. ఇప్పుడు లేటెస్ట్ వికెట్ పడింది. సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ వాకౌట్ చేసాడు. దర్శకుడు బాబితో సరిపడక అన్నది టాక్.
బాబికి వచ్చిన పని అంతంతమాత్రం, అది సరపడలేను విన్సెంట్ కు అని ఓ టాక్. బాబి మాటలు కేర్ చేయడం లేదు విన్సెంట్ అని మరోటాక్. ఏదయితేనే వాకౌట్..అంటే ముచ్చటగా మూడో వికెట్. దాంతో ఆదివారం నుంచి సినిమాకు బ్రేక్.
అసలు పవన్ తానే డైరక్షన్ కూడా చేసుకుంటున్నాడు, బాబిని ముందు నిల్చోపెట్టి అని ఓ టాక్ వినిపిస్తోంది. బాబి వర్క్ కూడా పవన్ కు అంతగా నచ్చలేదని, కానీ ఆయనను మార్చితే, మరీ రాంగ్ సిగ్నల్స్ వెళతాయి డైరక్టర్ సర్కిల్ లోకి అని, అందుకే అలా వుంచి, తానే మాగ్జిమమ్ చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిళ్ల బోగట్టా. దాంతో మిగిలిన టెక్నీషియన్లకు ఇది అలుసుగా మారిందని అంటున్నారు.
మరోపక్క ఇంకో వదంతి కూడా వుంది. బాబికి తెరవెనుక వ్యవహారాలు, రాజకీయాలు చేయడంలో టాలెంట్ బాగా వుందని, బలుపు టైమ్ లోనే ఆ తరహా మాటలు వినిపించాయని అన్నది ఆ వదంతి సారాంశం. తనకు కిట్టని వాళ్లని స్మూత్ గా తప్పించగల నేర్పరి అని అంటున్నారు.
ఏది ఏమయినా ఇలా వికెట్టు పడుతూ వుంటే, కొత్త వికెట్లు తెస్తూ వుంటే, మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అంటూ ఎప్పటికి పూర్తవుతుందో సర్దార్ గబ్బర్ సింగ్.