సర్దార్ తో బాబీకి యూజ్ వుంటుందా?

బాబి రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ లాంటి పెద్దహీరో సినిమా పట్టేసాడు. ఈ వార్త రాగానే టాలీవుడ్ లో బాబీ అంత అదృష్ట వంతుడు వుంటాడా అనుకున్నారు. కానీ అప్పటి నుంచి సినిమా విడుదల…

బాబి రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ లాంటి పెద్దహీరో సినిమా పట్టేసాడు. ఈ వార్త రాగానే టాలీవుడ్ లో బాబీ అంత అదృష్ట వంతుడు వుంటాడా అనుకున్నారు. కానీ అప్పటి నుంచి సినిమా విడుదల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ..పాపం..బాబి సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి. సంపత్ నంది ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ వచ్చాడు బాబి. ఆ తరువాత అలా అలా నానుతూ వచ్చింది సినిమా.

ఫస్ట్ షాక్.. డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్ తో పడింది. బేసిక్ గా బాబి రైటర్.. ఆ తరువాతే డైరక్టర్. కానీ సర్దార్ సినిమాకు మధ్యలో ఎంటర్ అయ్యాడు బుర్రా. గోపాల గోపాల సినిమాతో పవన్ పరిచయమై, ఈ సినిమాకు ఛాయిస్ అయిపోయాడు. పవన్ – బుర్రా కలిపే చాలా వరకు డైలాగ్ వెర్షన్ రెడీ చేసారని ఇప్పుడు ఇండస్ట్రీ టాక్.

రెండో విషయం ఏమిటంటే.. స్క్రిప్ట్.. ఆ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయి వున్నదే. పవన్ పేరు పడుతోంది స్రీన్ మీద. కానీ ఆ స్క్రిప్ట్ తయారీ వెనుక సంపత్ నంది టీమ్ కూడా వున్నారన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. అంటే బాబీకి స్క్రిప్ట్ తో కూడా సంబంధం లేదు.

పాటలు.. పాటలు అన్నీ పవన్ అభిరుచి మేరకు, ఆయన, డ్యాన్స్ డైరక్టర్లతో కలిసి చేసుకున్నారు. ఆఖరి రెండు పాటలు కూడా బాబి లేకుండానే పవన్ విదేశాలకు వెళ్లి షూట్ చేసుకువచ్చారు.

ఎడిటింగ్.. సాధారణంగా డైరక్టర్.. ఎడిటర్ కలిసి ఈ పని ఫినిష్ చేస్తారు. అయితే పవన్ క్రియేటివ్ వర్క్స్ క్రియేటివ్ హెడ్ హరీష్ పాయ్ ఈ విషయంలో ఎక్కువ వర్క్ చేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇక డైరక్షన్.. ఈ విషయంలో కూడా బాబి కి చాన్స్ తక్కువే దక్కిందని వదంతులు వున్నాయి. ఎందుకంటే ఒకేసారి రెండు మూడు యూనిట్ లతో షూటింగ్ జరిపారు. బాబి ఒక్కడు అన్ని చోట్ల ఒకేసారి వుండలేడు కదా?

మొత్తం మీద పవన్ ఈ సినిమాకు తాను, తన టీమ్ తో ఎక్కువగా చేసారని అర్థమైపోతోంది. అడియో ఫంక్షన్ లో కూడా పవన్ స్వయంగా ఈ విషయం చెప్పాడు. జానీ అనే విఫలయత్నం తరువాత తాను ఇన్ వాల్వ్ అయ్యానని అన్యాపదేశంగా చెప్పకనే చెప్పాడు.

ఇప్పుడు గబ్బర్ సింగ్ ఫలితం ఎలా వున్నా దర్శకుడు బాబికి కలిసి వచ్చేది ఏదీ వుండేలా లేదు. ఎందుకంటే హిట్ అయితే క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. తేడా వచ్చిదంటే, బాబీ ఖాతాలో పడదు కానీ, ఫ్లాప్ సినిమా డైరక్టర్ అన్న ముద్ర పడిపోతుంది. దానా దీనా తేలేదేమిటంటే.. బాబీ కేరీర్ కు సర్దార్ సినిమా ఏమీ అంత ప్లస్ కానీ మైనస్ కానీ కాకుండా మిగిలిపోయే అవకాశమే ఎక్కువగా వుంది.

ఇంతకు ముందు గబ్బర్ సింగ్ క్రెడిట్ అంతా హరీష్ శంకర్ కు బదులు పవన్ కే పోయింది. పైగా ఆ తరువాత హరీష్ గ్రాఫ్ కిందకే వెళ్లింది కానీ, మళ్లీ పైకి లేవలేదు. ఇప్పుడు చేతిలో సినిమా లేదు. మరి బాబి భవిష్యత్ ఎలా వుంటుందో చూడాలి.