సాధారణంగా పెద్ద సినిమాలు, పెద్ద డైరక్టర్లు, పెద్ద హీరోల బైట్ లు, యూట్యూబ్ కంటెంట్ అంటే ఇట్టే వైరల్ అయపోతుంది. లక్షల నుంచి మిలియన్ల హిట్ లు ఇట్టే వచ్చేస్తాయి.
కానీ అలాంటిది అనిల్ రావిపూడి లాంటి క్రేజీ డైరక్టర్ సుబ్బరాజు-వెన్నెల కిషోర్ లాంటి క్రేజీ కమెడియన్లతో కలిసి వదిలిని సెటైరికల్ విడియోకి మాత్రం గట్టిగా ఇరవై వేల హిట్ లు రాలేదు. అది కూడా విడుదల చేసి రెండు రోజులు గడుస్తున్నా కూడా.
పండగకు వస్తున్న అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా ప్రమోషన్లలో ముందుకు దూసుకుపోతుండడం, పాటలు రెండు వదలడం, అవి దారుణంగా వైరల్ కావడం వంటివి జరిగాయి. కానీ అనిల్ రావిపూడి 'సరిలేరు' సినిమా స్ట్రాటజీ వేరు. డిసెంబర్ నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
నిజానికి అలా ఫిక్స్ అయిన వాళ్లు అలా వుండక, మధ్యలో ఓ సెటైరికల్ విడియో వదిలారు. సంక్రాంతి పండగకు విడుదల పెట్టుకుంటే ఇప్పటి నుంచీ ఈ హడావుడి ఎందుకు? అంటూ తన సినిమాకు సంబంధించి ఓ వివరణ, అవతల సినిమాకు సంబంధించి ఓ చిన్న సైటైర్ జోడించి వదిలారు అనిల్ రావిపూడి.
మహేష్ బాబుకు సంబంధించిన ఏ కంటెంట్ అయినా భయంకరంగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు లేకపోయినా ఆ సినిమా కంటెంట్ అన్నా కూడా అలాగే అవుతుంది. కానీ అనిల్ రావిపూడి విడియో మాత్రం ఇలా చీదేసింది ఏమిటో?
బహుశా మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ ఈ విడియోను అంత సీరియస్ గా తీసుకుని వర్క్ చేయలేదని అనుకోవాలి. ఎందుకంటే వాళ్లు వర్క్ చేస్తే హిట్ లు వేరుగా వుంటాయి. ఇలా నత్తనడక నడుస్తోంది అంటే వాళ్ల దృష్టి దీని మీద పడి వుండకపోవచ్చు.