రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరు చెప్పి తాను కోరుకున్న స్థాయిలో పబ్లిసిటీ పొందుతున్నాడు. మీడియా ఛానల్స్ ముందుకొచ్చి, సినిమాపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాడు. 'అభ్యంతరాలుంటే సెన్సార్ బోర్డ్‌కి చెప్పుకోండి.. కేసులు పెట్టుకోండి..' అంటున్నాడు. ఇంతకీ, 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో వర్మ ఏం చూపించబోతున్నాడు.? అంటే మాత్రం, అది సినిమాలో చూసి తెలుసుకోమని వర్మ ఉచిత సలహా ఇస్తున్నాడు.
'నేనెవర్నీ సినిమా చూడమని బలవంతం చేయడంలేదు. నచ్చితే సినిమా చూడండి.. లేకపోతే మానెయ్యండి.. నా సినిమా నాకు నచ్చినట్లు తీస్తాను..' అని తేల్చి చెప్పేస్తున్నాడు వర్మ. అన్నట్టు, వర్మ ఈ సినిమాలో వున్న పాత్రలేవీ ఎవరికీ రిజెంబలెన్స్ కాదని అంటున్నాడు. అంటే, ఏ రాజకీయ ప్రముఖుడ్నీ పోలిన పాత్రలు కావట.. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలోని ముఖ్యపాత్రలు. కానీ, ఒక్క కేఏ పాల్‌కి సంబంధించి మాత్రం పోలిక వుంటుందట.
ఆయన్ని మాత్రం ఎందుకు అలా చూపించడం.? అనడిగితే, 'ఆయనంటే నాకు భయం.. ప్రార్థన చేసి, ఏసు క్రీస్తు ద్వారా నన్ను చంపించేస్తాడేమో..' అని వర్మ తాజాగా ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో సెలవిచ్చాడు. ఓ సందర్భంలో వర్మ తన కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడని కె.ఎ.పాల్ చెబితే, దానికి స్పందిస్తూ.. 'బయోపిక్ తీయమని పాల్ మనుషులే తన వద్దకు వచ్చారు' అని వర్మ అప్పట్లో చెప్పడం.. అదీ ఎన్నికల సమయంలో బోల్డంత 'ఫన్' క్రియేట్ చేసింది. వర్మ మాటల్లోని 'భయానికి' అర్థం ఇదీ.
ఇక, 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో వైఎస్ జగన్ పాత్రతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలూ వున్నాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కూడా వదల్లేదు. ఇంకా చాలా చాలా పాత్రలు వున్నాయి. అన్నిటికీ ఆయా వ్యక్తులు గుర్తుకొచ్చేలా మేకప్ చేయించాడు వర్మ. కానీ, ఏ పాత్రా ఎవరితోనూ పోల్చేలా తాను సినిమా తెరకెక్కించడంలేదని వర్మ అంటున్నాడు. ఇలాంటి స్టేట్‌మెంట్లు వర్మకి మాత్రమే చెల్లుతాయేమో.!