తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వాట్సాప్ రాజీనామా ద్వారా చర్చకు తెరలేపిన వల్లభనేని వంశీమోహన్ తన తదుపరి రాజకీయంపై తర్జనభర్జనల్లో ఉన్నట్టున్నారు. ముందుగా బీజేపీ నేతను కలిశారు వంశీ. ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు ఈయనను స్నేహితులు తీసుకెళ్లారు. ఇంకోవైపు వంశీని బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. విజయవాడకే చెందిన నేతలను పంపి వంశీకి సర్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారట!
అయితే వంశీ తమకు అందుబాటులోకి రావడంలేదని తెలుగుదేశం పార్టీ నేతలు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని వీడటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వంశీ రెడీ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక వంశీ రాక మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా రచ్చ ఉంది.
గన్నవరం నుంచి పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఈ విషయంలో అసహనంతో ఉన్నారు. వంశీ చేరికను వారు వ్యతిరేకిస్తున్నారు కూడా. అయితే వారికి అధిష్టానం నుంచి భరోసా వచ్చినట్టుగా టాక్ మొదలైంది. ఉపఎన్నిక ఎమ్మెల్యే టికెల్ దక్కని పక్షంలో ఎమ్మెల్సీ నామినేషన్ ను ఖరారు చేశారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ మేరకు కృష్ణాజిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వర్తమానం వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ వ్యవహారంలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో అనేది ఆసక్తిదాయకంగా మారింది.