దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సర్కార్ తమిళనాట పొలిటికల్ హీట్ పెంచింది. అధికార అన్నాడీఎంకే పార్టీ ఈ సినిమాపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కార్యకర్తలైతే ఊగిపోతున్నారు. తమ నాయకురాలు జయలలితను కించపరిచేలా, తమ పార్టీ విధానాల్ని వ్యతిరేకించేలా సర్కార్ లో చాలా సన్నివేశాలున్నాయని ఆరోపిస్తున్నారు. వాటిని తక్షణం తొలిగించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రంలోని పలు థియేటర్లలో రాస్తారోకోలు, ధర్నాలు చేపడుతున్నారు.
అన్నాడీఎంకే ఆందోళనలతో సర్కార్ యూనిట్ దిగొచ్చింది. నిన్న సాయంత్రం వరకు ఈ వివాదాన్ని చూసీచూడనట్టు ఊరుకున్న యూనిట్, ఎట్టకేలకు సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను మ్యూట్ (ఆడియో వినిపించకుండా) చేస్తామని ప్రకటించింది.
కానీ సర్కార్ యూనిట్ స్పందనతో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు శాంతించలేదు. కేవలం మ్యూట్ చేయడం కాకుండా, మొత్తంగా సన్నివేశాలన్నీ తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు సర్కార్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. అయినప్పటికీ లోపల సినిమా స్టార్ట్ అయిన వెంటనే, బయట థియేటర్ ను నాశనం చేస్తున్నారు కార్యకర్తలు.
మరోవైపు దర్శకుడు మురుగదాస్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ నిర్మాతలు ట్విట్టర్ లో ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే తాము అరెస్ట్ చేయడానికి రాలేదని, మురుగదాస్ కు భద్రత కల్పించడానికి వచ్చామని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మురుగదాస్ కూడా స్పందించాడు. పోలీసులు తన ఇంటి తలుపు తట్టారని, కానీ ఆ టైమ్ లో తను ఇంట్లో లేనని స్పష్టంచేశాడు.
మొత్తమ్మీద తమిళనాట సర్కార్ సినిమా పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. నిజానికి ఈ టైమ్ లో జయలలిత ఉంటే విషయం మరోలా ఉండేది. అసలు ఈ సినిమానే థియేటర్లలోకి వచ్చేది కాదు.
ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్