శర్వాకు ‘ఆ పాట’ తెచ్చిన చాన్స్

ఎన్టీఆర్ బయోపిక్ మొదలై ముగిసే వరకు నమ్మకాలు అయితే లేవు. లెక్క ప్రకారం మే 8న షెడ్యూలు స్టార్ట్ కావాలి. కానీ డైరక్టర్ లేరు. దాంతో సినిమా అలా ఎక్కడ వున్నది అక్కడే వుంది.…

ఎన్టీఆర్ బయోపిక్ మొదలై ముగిసే వరకు నమ్మకాలు అయితే లేవు. లెక్క ప్రకారం మే 8న షెడ్యూలు స్టార్ట్ కావాలి. కానీ డైరక్టర్ లేరు. దాంతో సినిమా అలా ఎక్కడ వున్నది అక్కడే వుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు ఆరంభం నుంచి వినిపించిన పేరు డైరక్టర్ క్రిష్ దే. అయితే ఆయన బాలీవుడ్ లో బిజీగా వున్నారు. దాంతో చాలా పేర్లు వినిపించి ఆఖరికి తేజ ఫైనల్ అయ్యాడు. అది కూడా ఇప్పుడు మారిపోయింది. ఆ కథ అంతా తెలిసిందే. లేటెస్ట్ గా మళ్లీ క్రిష్ ను లైన్లో పెట్టారు. డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. 

మహానటి సినిమా చూసిన తరువాత 'అంతకు మించి' వుంటే కానీ, అంతకుమించి తీస్తే కానీ, జనం ఇట్టే తీసి పక్కన పెడతారు. క్రిష్ సామర్థ్యం మీద శంక లేదు కానీ, బాలయ్య వ్యవహారం మీదే అనుమానం. ఆ ఇద్దరికి పొసగి సినిమా బయటకు రావాలి. అప్పుడు చూడాలి. అయితే ఇవన్నీ ఇలా వుంటే, ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా హీరో శర్వానంద్ ను తీసుకున్నారని గతంలోనూ వినిపించింది. ఇప్పుడూ వినిపిస్తోంది.

నిజానికి ఎన్టీఆర్ అయితే అద్భుతంగా వుంటుంది. కానీ నందమూరి బాలయ్యకు, ఎన్టీఆర్ ఉప్పు-నిప్పు అన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఆ చాన్స్ శర్వానంద్ ను వరించిందట. అలా వరించడం వెనుక కాస్త ఆసక్తికరమైన విషయం వుందని తెలుస్తోంది.

ఆ మధ్య వచ్చిన శతమానం భవతిలోని ఓ పాటలో శర్వానంద్ కాస్త ఓల్డ్ స్టయిల్ లుక్ లో కనిసిస్తాడు. ''..నిలవదే..మది నిలవదే చిరు సొగసులు చూసి..' అన్న పాటలో శర్వానంద్ 80ల కాలం నాటి గెటప్ లో కనిపిస్తాడు. ఆ పాట చూసిన తరువాత దర్శకుడు తేజ యంగ్ ఎన్టీఆర్ పాత్రకు శర్వాను ఫిక్స్ చేసి, బాలయ్యకుచెప్పి, ఆ పాట చూపించి మరీ ఓకె చేయించాడట.

ఆ విధంగా శర్వాకు ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా నటించే చాన్స్ వచ్చింది. క్రిష్ కు కూడా శర్వానంద్ అంటే అభిమానమే కాబట్టి, ఇప్పుడు డైరక్టర్ మారినా, శర్వా చాన్స్ మారదనే అనుకోవాలి. కానీ ఎంతయినా యంగ్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ అయితే వుండే కిక్ వేరు, లుక్ వేరు. శర్వా అయితే వచ్చే టచ్ వేరు.