నేలటికెట్ పరిస్థితి ఏమిటి?

బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టిన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఆ మధ్య ఓ హిట్, ఈ మధ్య ఓ డిజాస్టర్ చవిచూసిన హీరో రవితేజ. ఓం ప్రధమంగా ఇండస్ట్రీలోకి వచ్చి,…

బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టిన డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఆ మధ్య ఓ హిట్, ఈ మధ్య ఓ డిజాస్టర్ చవిచూసిన హీరో రవితేజ. ఓం ప్రధమంగా ఇండస్ట్రీలోకి వచ్చి, తెలిసో, తెలియకో 40కోట్లు పెట్టేసి  తొలి సినిమా చేసిన నిర్మాత రామ్ తాళ్లూరి. అలా తయారైన నేల టికెట్ సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. అన్నపూర్ణ కాంపౌండ్ లో రెండు హిట్ లు కొట్టాడు కళ్యాణ్ కృష్ణ అంటే ఆ రెండింటి వెనుక నాగ్ హస్తం కొంతయినా వుంది. పైగా ఆ రెండు సినిమాలో ఫ్యామిలీ డైరక్టర్ గా ముద్రపడ్డాడు.

అలాంటి కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు 'నేల టికెట్' అంటూ మాస్ టైటిల్ తో రావడం అన్నది కాస్త మైనస్ అనిపిస్తోంది. అలాగే రవితేజ లుక్ రాను రాను కాస్త ఇబ్బందిగా మారుతోందన్నది వాస్తవం. ఒకప్పుడు రవితేజ అంటే లాజిక్ లేకపోయినా, ఫన్ వుంటే చాలు బండి లాగేసే వ్యవహారం.

కానీ ఇప్పుడు రవితేజను తెరపై చూడడమే కాస్త ఇబ్బందిగా వుంటోంది. నేల టికెట్ సినిమాకు ఇదే అతి పెద్ద సమస్య. అలాగే దానికి తోడు ఈ సినిమాకు పాపులర్ హీరోయిన్ ఎవ్వరూ సెట్ కాలేదు. మాళవిక శర్మ-రవితేజ జోడీ ఎలా వుంటుందో చూడాలి.

అయితే రవితేజ సినిమాలకు వున్న అడ్వాంటేజ్ ఏమిటంటే, ఎంటర్ టైన్ మెంట్ వుంటే చాలు, ఇక సినిమా ఎలా వున్నా ఓకె. వినిపిస్తున్న సెన్సార్ రిపోర్ట్ ప్రకారం నేలటికెట్ తొలిసగం ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్కవుట్ అయింది అని తెలుస్తోంది. సినిమా నిడివి రెండు గంటల యాభై నిమషాలు అని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ గత సినిమాల విషయంలో నిర్మాత నాగ్ కలుగ చేసుకుని, కాస్త కటింగ్ లు చేసారు. ఇక్కడ అలా కత్తెరలు పడినట్లు లేదు.

సినిమాకు బడ్జెట్ కాస్త సమస్యే. శాటిలైట్, డిజిటల్ వంటి వ్యవహారాలు పోయినా, ఇరవై పాతిక కోట్ల మేరకు థియేటర్ల నుంచి రాబట్టాలి. సినిమాను దాదాపు నేరుగా విడుదల చేస్తున్నారు. అందువల్ల నిర్మాత రామ్ తాళ్లూరికి తొలి సినిమానే కాస్త అగ్ని పరీక్ష అనుకోవాలి.