మన ఆదాయపన్ను శాఖ వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. ఎక్కడన్నా పారదర్శకత వుంటుందేమో కానీ ఇక్కడ మాత్రం కాదు. రెయిడ్స్ జరిగితే జరిగాయని మీడియాలో రావడమే కానీ, ఆ శాఖమాత్రం చెప్పదు. రెయిడ్ చేసాక కీలకపత్రాలు స్వాధీనం అని వార్తలు రావడమే కానీ, ఆ శాఖ నుంచి ఏ ప్రకటన రాదు.
పోనీ కేసు పడిన తరువాత ఆర్నెల్లకో, ఏడాదికో ఇదీ విషయం అని వివరించరు. ఏ మీడియాకు ఆ మీడియా ఏదో విధంగా సమాచార సేకరణ చేసి అందించడమే తప్ప, మరే మార్గం వుండదు. వైనం తెలియదు. తమిళనాడులో చిరు అల్లుడి ఇంటిలో ముఫై కోట్ల నగదు దొరకడం అప్పట్లో సెన్సేషన్. కానీ ఆ తరువాత ఆ కేసు ఏమయింది? ఆ క్యాష్ ఏమయింది? ఈ వివరాలు అన్నీ ఎక్కడా ఎవరికీ తెలియవు.
తాజాగా శాతకర్ణి సినిమా లెక్కలకు సంబంధించి ఇటు నిర్మాతలు, అటు నైజాం బయ్యర్ల ఇళ్లపై, ఆఫీసులపై సోదాలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే ఏం జరిగిందన్నది తెలియదు. అయితే టాలీవుడ్ లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సోదాల్లో ఐటిశాఖకు, ఓ కీలకపత్రం దొరికిందట. అదేమిటంటే, శాతకర్ణి సినిమా నైజాం లావాదేవీలకు సంబంధించిన వివరాలు వున్న పత్రమని తెలుస్తోంది.
ఈ పత్రం దొరకడంతో శాతకర్ణి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా కిందామీదా పడ్డారని ఆఖరికి, సామ,దాన తదితర ఊపాయాలతో ఆ గండం నుంచి గట్టెక్కారని తెలుస్తోంది. ఈ పత్రం లో నైజాం అమ్మకాలు, రాబడులు, లాభాలు బ్లాక్ అండ్ వెైట్ ట్రాన్సాక్షన్లు వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మేనేజ్ జరిగిపోయింది కాబట్టి ఇక సమస్య ఏమీ లేనట్లే అని తెలుస్తోంది.