సత్యమూర్తి తప్పటడుగులు

సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత కీలకమో, పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కూడా అంతే కీలకం. కానీ సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో ఈ పోస్టు పబ్లిసిటీ విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా గురువారం విడుదలైతే, ఆరేడు…

సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ ఎంత కీలకమో, పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కూడా అంతే కీలకం. కానీ సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో ఈ పోస్టు పబ్లిసిటీ విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా గురువారం విడుదలైతే, ఆరేడు రోజులకు సినిమా కలెక్షన్లు బిళ్ల బీటుగా పడిపోయాయి. విశాఖ బయ్యర్ కు రెండు కోట్ల వరకు నష్టం కనిపిస్తోంది అంటున్నారు. వెస్ట్ గోదావరి బయ్యర్ కు యాభై లక్షల వరకు అన్న వార్తలు వినవస్తున్నాయి. 

చిత్రంగా సినిమా గురువారం విడుదలైతే, రెండు రోజులు ఆగకుండా శనివారమే డైరక్టర్ ఇంటర్వూలు పెట్టేసారు. తీరా చేసి ఆయనేమన్నారు. సోమవారం దాటితే కానీ సినిమా పరిస్థితి చెప్పలేనన్నారు. ఒక దర్శకుడే తన సినిమా మీద అలా అనడం జనంలోకి తప్పుడు సిగ్నళ్లను పంపించింది. పైగా సినిమా విడుదలయిన మూడు నాలుగు రోజులు కలెక్షన్లు ఎలాగూ వుంటాయి. 

అప్పుడు దర్శకుడి ప్రెస్ మీట్ ఎందుకు? అదే సోమవారం తరువాత పెడితే, ఈ మాటా ఉండకపోను, మరో రెండు రోజులు సినిమాకు బూస్ట్ వచ్చేది. అలా కాకుండా సినిమా విడుదలకు ముందే హీరో, విడుదల వెంటనే డైరక్టర్, ఆ వెంటనే హీరోయిన్ ప్రచార వ్యవహారాలు ముగిసిపోయాయి. ఇక నాలుగు రోజుల తరువాత ఏమీ చేయకుండా వదిలేసారు. పోనీ విజయోత్సవ సభ అన్నారు. అదేదో గురువారం లేదా శుక్రవారం ప్లాన్ చేసి వుంటే వీకెండ్ కలెక్షన్లకు దన్నుగా నిలబడేది. ఏ సినిమాకైనా కలెక్షన్లు స్టడీగా వుంచడం కీలకం. డ్రాప్ అయ్యాక లేపడం కష్టం. ఇప్పుడు ఆ విజయోత్సవ సభ కూడ అయోమయంలో పడింది. 

ఇదిలా వుంటే సినిమా ప్రచార వ్యవహారాలు ఇలా వుండడానికి కారణం పీఆర్ మేనేజ్ మెంట్ కానీ, యూనిట్ వర్గాలు కానీ కారణం కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సన్నిహితుడైన ఒకరు పీఆర్ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇలా జరిగిందని టాక్. జులాయి సమయంలో కూడా ఆయనే ఇలాంటి నిర్ణయాలు అన్నీతీసుకున్నారని అంటున్నారు. 

ఎంతవరకు నిజమో కానీ, ఎవరు చేసే పనిని వారిని చేయనిస్తే, సరిగ్గా వుంటుంది వ్యవహారం. అలా కాకుంటే ఇలాగే వుంటుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది టాలీవుడ్ లో.