సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓటమిని ముందే ఊహించారో ఏమోగానీ, కౌంటింగ్ పరిసరాల్లోకి ఆమె వెళ్ళలేదు. తర్వాత తీరిగ్గా ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆ స్పందనలో ఆమె కొత్త ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌కి నీతులు చెప్పేందుకు ప్రయత్నించారు. అఫ్‌కోర్స్.. ఉచిత సలహా పేరుతో సెటైర్లు వేశారనుకోండి.. అది వేరే విషయం.
గెలిచిన తర్వాత రాజేంద్రప్రసాద్, రాజకీయ ప్రసంగాలు చేయడం తనకు నచ్చలేదన్నది జయసుధ వాదన. రాజేంద్రప్రసాద్ గెలిచినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతూనే, నాయకుడిగా ఆయన వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని జయసుధ చురకలంటించారు. నిజమే, కౌంటింగ్ తర్వాత రాజేంద్రప్రసాద్ కాస్త ఎగ్రెసివ్‌గానే మాట్లాడారు. అయితే, దానికి కారణాలు చాలానే వున్నాయి.
సాధారణ ఎన్నికలతో సమానంగా ‘మా’ ఎన్నికల్ని మార్చాలనుకున్న మురళీమోహన్, జయసుధ వ్యూహాలు ఫెయిలయ్యాయి. సినీ పరిశ్రమలో ఎన్ని వివాదాలున్నా, ఇప్పుడు ‘మా’ ఎన్నికల సందర్భంగా బయటపడినంత తీవ్రంగా అయితే ఎప్పుడూ బయటపడలేదు. దారుణాతి దారుణమైన విమర్శలు చేసుకున్నారు. ఎక్కువగా జయసుధ వర్గం నుంచే రాజకీయం తరహాలో విమర్శలు దూసుకొచ్యాన్నది కాదనలేని వాస్తవం.
మురళీమోహన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో, ఏకగ్రీవం అవుతుందన్న నమ్మకంతో, తనకు ఇండస్ట్రీలో అందరూ మద్దతిస్తారన్న నమ్మకంతో రాజేంద్రప్రసాద్ పోటీకి ఉపక్రమించారు. ఆయనకు సినీ ఇండస్ట్రీలో వున్న గుర్తింపు నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నిక అయి వుంటే అది ఆయనకే కాక, ‘మా’ గౌరవం కూడా పెరిగి వుండేది. పోనీ, ఎన్నికలే జరగాలని కోరుకుని వుంటే, తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పినప్పుడే మురళీమోహన్, జయసుధ పేరును ప్రతిపాదించాల్సి వుంది. అలా చేస్తే రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి పోటీలో నిలిచేవారే కాదేమో.
వెరసి ఈ ఎపిసోడ్‌లో మురళీమోహన్, జయసుధ రాజకీయం చేశారన్న భావన అయితే సినీ జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇంత రాజకీయం అవసరమా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళని తనను బదనాం చేశారన్న ఆవేదన రాజేంద్రప్రసాద్‌లో కలగడంలో తప్పేముంది.? అందుకే గెలిచాక కూడా రాజేంద్రప్రసాద్, తన మీద జరిగిన రాజకీయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో జయసుధ నీతులు చెప్పడానికేమీ లేదు. చెప్పి ఆమె తన స్థాయిని మరింత తగ్గించేసుకుంటున్నారేమో.!