సీనియారిటీ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా చేయాలనే తపన మన హీరోల్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. సీనియర్ హీరోలంతా ఇప్పుడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం ఈ వయసులో కండలు పెంచడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున.
రెడీ అవ్వడమేంటి.. ఆల్రెడీ జిమ్ లో హెవీ వర్కవుట్స్ కూడా ప్రారంభించాడు. వర్మ సినిమాలో పోలీసాఫీసర్ గా, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు నాగ్. ఈ క్యారెక్టర్ కోసం కాస్త కండపడితే బాగుంటుందని స్లిమ్ గా ఉండే నాగ్ ఇలా జిమ్ బాట పట్టాడు.
తన కొత్త సినిమా కోసం వెంకీ కూడా మారబోతున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చే నెల నుంచి కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాలో 2డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడట వెంకీ. ఒక గెటప్ లో గుబురు గడ్డంతో ప్రొఫెసర్ లా, మరో గడ్డంలో క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ గెటప్ లో కనిపిస్తాడట. ఈ సినిమాకు “ఆట నాదే – వేట నాదే” అనే డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు.
ఇక చిరంజీవి కూడా సైరా కోసం మేకోవర్ అయిన విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్ తో పాటు డిఫరెంట్ మీసకట్టు, గడ్డం ట్రై చేస్తున్నాడు. అటు మరో సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కొత్త వేషం ప్రయత్నిస్తున్నాడు. మహానటి సినిమా కోసం ఈ హీరో ఎస్వీ రంగారావుగా మారిపోయాడు. ఎస్వీఆర్ పోషించిన ఘటోత్కచుడు పాత్రను కూడా పోషించాడు.
బాలయ్య కూడా ఉన్నంతలో ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో వీరయోధుడిగా కనిపించిన బాలయ్య.. పైసా వసూల్ లో పక్కా మాస్ గా కనిపించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న జై సింహా సినిమాలో కూడా 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట.